
లింగ నిర్ధారణపై కఠినంగా వ్యవహరించాలి
అనంతపురం అర్బన్: ‘గర్భస్థ పిండ లింగ నిర్ధారణపై కఠినంగా వ్యవహరించాలి. స్కానింగ్ సెంటర్లను విస్తృతంగా తనిఖీ చేయాలి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేయండి’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పీసీపీఎన్‌డీటీ యాక్ట్ (గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం) అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ తీవ్ర నేరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి విషయంలో చాలా కఠినంగా ఉండాలని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, ఆర్‌డీటీ సంస్థ ప్రతినిధి డాక్టర్ దుర్గేష్, సీఐ బాషా, డెమో త్యాగరాజ్ పాల్గొన్నారు.
మొక్కజొన్న వ్యాపారిపై కేసు
యాడికి: రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వ్యాపారిపై యాడికి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఎ.సంతోష్‌కుమార్ అనే వ్యక్తి శ్రీ చంద్రాల పరమేశ్వర ట్రేడర్స్ ఆల్ పౌల్ట్రీ ఇంగ్రీడియ్స్ అండ్ రా మెటీరియల్స్ సంస్థ ఉంది. గత ఏడాది ఈ వివరాలతో కూడిన విజిటింగ్ కార్డును యాడికి మండలం తూట్రాళ్లపల్లికి చెందిన పెద్దయ్య కుమారుడు నూతల సాయి కల్యాణ్‌కు పంపాడు. దీంతో సాయి కల్యాణ్ రూ.1,28,14,340 విలువ గల మొక్కజొన్న పంటను హైదరాబాద్‌లోని సంతోష్ కుమార్‌కు విక్రయించాడు. ఇందులో రూ.68,26,080 మాత్రమే ఇచ్చి.. మిగతా సొమ్ము ఇవ్వకుండా మోసం చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో సాయి కల్యాణ్ ఫిర్యాదు మేరకు సంతోష్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ గురించి ఏమాత్రం పట్టించుకోలేదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, నాయకులు గోవిందరెడ్డి, రాధాకృష్ణరెడ్డి, వెంకటరమణప్ప, గోపాల్, వెంకటరెడ్డి, రామకృష్ణ శనివారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉన్న పీఆర్సీ కమిటీ ఏడాది కిందట రద్దయిందని పేర్కొన్నారు. మళ్లీ పీఆర్సీ కమిటీ వేయకుండా, కనీసం ఐఆర్, డీఏ కూడా ప్రకటించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.