
కేవీకేలో సర్టిఫైడ్ విత్తనాలు
బుక్కరాయసముద్రం: మండలంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో సర్టిఫైడ్ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి పేర్కొన్నారు. కందులు (పీఆర్‌జీ–176, ఉజ్వల), (ఎల్‌ఆర్‌జీ–52 అమరావతి) కిలో రూ.150, 4 కిలోల బ్యాగ్ రూ.600, పెసర (ఎల్‌జీజీ–607, ఎల్‌జీజీ 574), మినుములు (ఎల్‌బీజీ 884) కిలో రూ.150తో విక్రయిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 97046 66923, 70135 71755లో సంప్రదించాలని కోరారు.
ఆయుర్వేద ఉత్పత్తుల సేవా
కేంద్రంలో విజిలెన్స్ తనిఖీలు
అనంతపురం: స్థానిక ఎ.నారాయణపురం పంచాయతీ రాఘవేంద్ర కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న ప్రజలను తప్పుదోవ పట్టించే ఆయుర్వేద ఉత్పత్తుల సేవా కేంద్రంలో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కస్టమర్ల నుంచి ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ కనిపించారు. కొనుగోలుదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, సేకరించిన మొత్తం ఇతర వివరాలు, వాట్సాప్ చాటింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించారు. ఎస్–3 గ్రూప్స్ పవర్ సిరప్, సీహెచ్‌ఆర్ డీఐఏ కంట్రోల్ సిరప్, ఎస్3 గ్రూప్స్ ఆయుర్వేద ఉత్పత్తులపై సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా విరివిగా ప్రచారం చేస్తున్నారు. షుగర్ వ్యాధిని నియంత్రిస్తామని, ప్రజల్లో లైంగిక శక్తిని పెంచుతామని నమ్మబలికి కాల్ చేసే వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఈ వివరాలను నెల్లూరుకు చెందిన భరత్ అలియాస్ ఆలకుంట భరత్ కుమార్‌కు పంపిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ శ్రీనివాసులు, ఆయుర్వేద డాక్టర్లు డాక్టర్ కె.మాధవి, డాక్టర్ కేఎస్ రాంకుమార్, డాక్టర్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
మమ్మల్ని వదలి వెళ్లకండి సార్..
కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు హనుమంతురాయుడు ఇటీవల మరొక పాఠశాలకు బదిలీ అయ్యారు. శుక్రవారం పాఠశాలలో వీడ్కోలు సభ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ‘మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారు. హనుమంతురాయుడు విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని.. వారికి అనుగుణంగా బోధన చేసేవారని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. పేద విద్యార్థులకు గురుకులం, ఏపీఆర్‌ఎస్ వంటి వాటికి శిక్షణ ఇచ్చి.. ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.