
తుంగభద్ర తుళ్లింత
బొమ్మనహాళ్: ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గురువారం తుంగభద్ర జలాశయం 20 క్రస్ట్ గేట్లను బోర్డు అధికారులు ఎత్తివేశారు. రెండున్నర అడుగుల మేర ఎత్తి నదికి 58,260 క్యూసెక్కులు, వివిధ కాలువలకు 4,506 క్యూసెక్కులు కలిపి మొత్తం 62,766 క్యూసెక్కులను బయటికి పంపుతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీలకు కుదించారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోపే ఆమేరకు నీరు చేరడం గమనార్హం. దీంతో డ్యాంలో 78.100 టీఎంసీలు నిల్వ ఉంచి మిగిలిన నీటిని నదికి వదులుతున్నారు.
పాలకుల నిర్లక్ష్యం..
గత ఏడాది డ్యాం 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయినప్పుడు తాత్కాలికంగా స్టాప్‌లాక్ గేటు అమర్చారు. అయితే, జలాశయం 33 క్రస్ట్ గేట్లకూ మరమ్మతులు చేయాలని అప్పట్లోనే నిపుణుల కమిటీ సూచించింది. అయినా పాలకులు సరైన నిర్ణయం తీసుకోకపోవడం రైతులకు శాపంగా మారింది. గత రబీలో కాలువలకు నీటి విడుదలను ఆపేసిన తర్వాత గేట్ల మరమ్మతు విషయంలో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించాయి. దీంతోనే ఈ ఏడాది డ్యాంలో 100 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు నీటి నిల్వను కుదించే దుస్థితి ఏర్పడింది.
వరినార్లలో బిజీబిజీ
ప్రస్తుతం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 28,932 క్యూసెక్కులుగా నమోదవుతోంది. గురువారం ఉదయం 12 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో పెరగడంతో సాయంత్రానికి మరో 8 గేట్లు మొత్తంగా 20 గేట్లు ఎత్తి నదికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 10న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో ఆయకట్టు రైతులు వరి నార్లు వేసుకుంటున్నారు. ప్రసుత్తం జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,625.34 అడుగులకు నీరు చేరుకుంది. అవుట్‌ఫ్లో 62,268 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 78.100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1,587.11 అడుగుల వద్ద 8.78 టీఎంసీల నీటి నిల్వతో, 10,503 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 296 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండిందని బోర్డు అధికారులు తెలిపారు.
20 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
58,260 క్యూసెక్కుల నీరు నదికి