
మెరుగైన వైద్యసేవలందించాలి
● కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం అర్బన్: రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యారోగ్యశాఖ పనితీరుపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన సేవలు అందించేందుకు అనువుగా సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. ఆరోగ్య శాఖ ద్వారా చేపట్టిన పనులు గడువులోపు పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, డీసీహెచ్‌ఎస్ డేవిడ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ షారోన్‌సోనియా తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లో సంతృప్తస్థాయి పెంచాలి
ప్రజల్లో సంతృప్తస్థాయి పెరిగేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు.డీఆర్‌డీఏ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య, మునిసిపల్, రీ–సర్వే, తదితర అంశాలకు సంబంధించి ఐవీఆర్‌ఎస్ సర్వేపై కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజాస్పందన సమీక్ష ఉన్నతస్థాయిలో జరుగుతోందన్నారు. ఈ అంశానికి సంబంధించి అన్ని శాఖలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలని చెప్పారు.
పొద్దున్నే పెన్షన్ ఇవ్వలేదని.. సచివాలయ సిబ్బందికి షోకాజ్
శింగనమల: మండలంలో 27 మంది సచివాలయ సిబ్బందికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 1న ఉదయం 7.40 గంటలైనా పింఛన్ పంపిణీ ప్రారంభించకపోవడంపై ‘షోకాజ్’ ఇచ్చినట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చినట్లు ఇన్‌చార్జ్ ఎంపీడీఓ భాస్కర్ తెలిపారు.
రేపు బీఎస్‌ఎన్‌ఎల్
జాతీయ లోక్ అదాలత్
అనంతపురం సిటీ: బీఎస్‌ఎన్‌ఎల్ జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఉమ్మడి జిల్లా జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్ పాషా తెలిపారు. బకాయి పడిన మొబైల్ వినియోగదారులకు ఇప్పటికే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నోటీసులు జారీ చేశామని, అటువంటి వారు కోర్టుకు హాజరు కాకుండానే జాతీయ లోక్ అదాలత్‌కు హాజరై బకాయిలను రాయితీతో చెల్లించవచ్చని సూచించారు.
ఆ టీచర్లను రిలీవ్ చేయండి
అనంతపురం ఎడ్యుకేషన్: రెగ్యులర్ టీచర్లను రిలీవ్ చేయాలని డీఈఓ ప్రసాద్ ఎం. బాబు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో కొందరని రిలీవర్ లేని కారణంగా రిలీవ్ చేయలేదని, దీంతో వారి పాఠశాలల్లో ఎంటీఎస్ టీచర్లు జాయిన్ అయ్యారని డీఈఓ పేర్కొన్నారు. బదిలీ అయిన రెగ్యులర్ ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని ఎంఈఓలను ఆదేశించారు. ఏదైనా పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కంటే తక్కువగా ఉపాధ్యాయులు ఉన్నట్లయితే ఆ సబ్జెక్టు టీచర్ బదిలీ అయినప్పటికీ వారు గతంలో పనిచేసిన పాఠశాలలోనే పని చేయాలన్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.