
దళితులకు అండగా ఉందాం
అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వంలో దళిత సామాజిక వర్గంపై దాడులు పెరిగి పోయాయి. వైఎస్సార్ సీపీ దళితుల పక్షాన నిలబడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. జిల్లాలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్సీ సెల్ ముందుండాలి. ప్రభుత్వంపై సంఘటిత పోరాటానికి సిద్ధం కావాలి’ అని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు అధ్యక్షతన ఆ విభాగం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూ ఆయా వర్గాలను అక్కున చేర్చుకున్నారన్నారు. దళితుల అభ్యున్నతికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నారన్నారు. పేద విద్యార్థుల ఉన్నత భవితే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విజయవాడలో 205 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు.
భయపెట్టేందుకు అక్రమ కేసులు
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎస్సీ సెల్ కృషి చేయాలని ‘అనంత’ పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు. మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని, అందులో వైఎస్సార్ సీపీ సత్తా చాటాలన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. దళితుల్లో నాయకత్వం లేకుండా చేయాలన్న కుట్రతో మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై కేసులు నమోదు చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.
చంద్రబాబు మోసాలను తెలియజేద్దాం..
వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ నెల 15 నుంచి గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను వివరిద్దామని ‘అనంత’ పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. అనంతరం ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో దళిత వర్గాలపై దాడులు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందన్నారు. మృగాళ్లతో ఇబ్బంది పడ్డ వారికి న్యాయం చేద్దామన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం దారుణమన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, అధికార ప్రతినిధి ఎగ్గుల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ మాట్లాడుతూ దళితులకు అన్యాయం జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణం ఆమె పదవికి రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న ఎంఎస్ రాజు, బండారు శ్రావణి దళితులకు జరిగిన అన్యాయంపై కనీసం మాట మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూటమి ప్రభుత్వ పెద్దల మోచేతి నీళ్లు తాగుతున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఎర్రిస్వామి, బీటీపీ గోవిందు, పసులూరు ఓబులేసు, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడ అన్యాయం జరిగినా
ఎస్సీ సెల్ ముందుండాలి
ఈ నెల 15 నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి బాబు మోసాలను వివరించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత