
కదిలిన జగన్నాథ రథ చక్రాలు
అనంతపురం కల్చరల్: అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అనంత వేదికగా మరోసారి పూరీ జగన్నాథ రథయాత్ర వేడుకగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కళాకారులు, ఇస్కాన్ మందిరాల ప్రతినిధులు అనంతకు చేరుకుంటున్నారు. ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన పూరీ రథయాత్రను 2015లో ఇస్కాన్ మందిరం అనంతలో ఘనంగా నిర్వహించింది. దేశంలోనే అతి పెద్దదైన పూరీ జగన్నాథుడి వేడుకలను దూరాభారం వల్ల చూడలేని వారికి.. వారి ముంగిటనే రథయాత్రను చూసే భాగ్యాన్ని ఇస్కాన్ తీసుకువచ్చింది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటి వరకూ ఆరు సార్లు వైభవంగా రథయాత్ర వేడుకలు జరిగాయి. ఈ నెల 5న సాగే వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.
రథయాత్ర సాగుతుందిలా..
తొలుత రెండు రోజుల పాటూ రథయాత్ర ఘనంగా నిర్వహించాలని ఇస్కాన్ ప్రతినిధులు భావించారు. కానీ ఒక్కరోజు యాత్రకు కూడా జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతివ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి రథయాత్ర సజావుగా సాగేలా కృషి చేశారు. ఈ నేపథ్యంలో కళాజాత, ఆధ్యాత్మిక ప్రవచనాలు, వేద పఠనం నడుమ జగన్నాథ రథయాత్ర శనివారం ఉదయం లలిత కళాపరిషత్తులో ప్రారంభం కానుంది. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు సాగుతాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు స్థానిక కేఎస్‌ఆర్ కాలేజ్ సమీపంలో మహా అభిషేకంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. నగర పాలక సంస్థ కార్యాలయం, సుభాష్‌రోడ్, టవర్‌క్లాక్, రాజు రోడ్డు, శ్రీకంఠం సర్కిల్, తిలక్‌రోడ్, గాంధీబజార్, పాతూరు మీదుగా బసవన్నకట్ట నుంచి మళ్లీ సప్తగిరి సర్కిల్ మీదుగా లలిత కళాపరిషత్తుకు చేరుకుంటుంది. విశిష్ట అతిథిగా శ్రీమాన్ సత్యగోపీనాథ్ ప్రభు విచ్చేసి ఆధ్యాత్మిక ప్రవచనం చేయనున్నారు. సినీనటుడు సుమన్ ఆత్మీయ అతిథిగా విచ్చేసి రథయాత్రను ప్రారంభిస్తారు. అలాగే కళాజాతను పలువురు ప్రజాప్రతినిధులు ఆరంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా కేరళ, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన కళాకారులు అనంతకు విచ్చేసి తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు. నగర వీధుల్లో శోభాయమానంగా సాగే రథయాత్రలో అనంత వాసులు భాగస్వాములు కావాలని గురువారం ఇస్కాన్ మందిరంలో జరిగిన సమావేశంలో నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు ఆదేశంతో లైన్ క్లియర్
5న అనంతలో రథయాత్ర
తరలి రానున్న జాతీయ ఇస్కాన్ ప్రతినిధులు, సినీ ప్రముఖులు