
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించండి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్
అనంతపురం అర్బన్: స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించాలని జిల్లా ప్రజలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు రూపొందించిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ ప్రక్రియను సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలోని శ్రీశ్రీనగర్‌లో ఆయన ప్రారంభించి, మాట్లాడారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఫిర్యాదు నేరుగా ముఖ్యమంత్రికి చేరుతుందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ భారం మరింత పెరుగుతుందన్నారు. ఇప్పటికే భారంగా మారిన ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలన్నారు. విద్యుత్ భారాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి, నాయకులు వలి, ప్రకాష్, జీవ, కుమార్, రాఘవ, హరికృష్ణ, పాల్, మాబు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజలకు రెట్టింపు సంక్షేమం
● ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా...ప్రజలకు రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది పాలనలో రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఛిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టి రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశాంతత, అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చామన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు.
కలుషిత నీరు తాగి 16 జీవాల మృతి
బెళుగుప్ప: కలుషిత నీరు తాగి 16 జీవాలు మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలం కోనంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గురువారం ఉదయం తన మొక్కజొన్న పంటకు యూరియా కలిపిన నీటిని డ్రిప్ ద్వారా అందిస్తూ ఇతర పనుల్లో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో గొర్రెల మంద అక్కడకు చేరుకుంది. దాహంతో ఉన్న గొర్రెలు, మేకలు అప్పటికే తొట్టెలో ఉన్న యూరియా కలిపిన నీటిని తాగాయి. కాసేపటి తర్వాత ఒకదాని వెనుక మరొకటి చొప్పున 10 గొర్రెలు, 5 మేకలు, ఓ పొట్టేలు మృత్యువాత పడ్డాయి. కాపరులు తిప్పయ్య, మహేష్, వన్నూరుస్వామి, రామాంజనేయులు, అంజనప్ప, లింగన్న నుంచి సమాచారం అందుకున్న పశువైద్య సహాయకుడు ఎర్రిస్వామి అక్కడకు చేరుకుని పరిశీలించారు. విషమ పరిస్థితిలో ఉన్న జీవాలకు సత్వర చికిత్స అందించారు. గొర్రెల పోషణపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కాపరులు కోరారు.
డీఎస్పీ పదోన్నతుల సీనియార్టీ జాబితా విడుదల
అనంతపురం: డీఎస్పీ పదోన్నతులకు సంబంధించి తాత్కాలిక (అడహాక్ ) సీనియార్టీ జాబితాను అధికారులు విడుదల చేశారు. 2024–25 ప్యానల్‌లో సీనియార్టీ జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీఐలు ఉన్నారు. వీరిలో కె.దేవానంద్ (అనంతపురం), ఎం.ఆదినారాయణ (పీటీసీ అనంతపురం), కె.సాయినాథ్ (అనంతపురం), ఎస్వీ భాస్కర్‌గౌడ్ (అనంతపురం), పి.సత్యబాబు (అనంతపురం), శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని బి.మోహన్, కె.రాఘవన్, జి.బాలసుబ్రహ్మణ్యం రెడి ఉన్నారు.

స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించండి

స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించండి