
వక్ఫ్ నూతన చట్టం రాజ్యాంగ విరుద్ధం
అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ నూతన చట్టం పూర్తి రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం మైనారిటీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తోందని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ జాఫర్, సభ్యులు మేయర్ వసీం, నదీమ్ అహమ్మద్, తదితరులు మాట్లాడారు. ఇటీవల ఆమోదించన వక్ఫ్ చట్టం.. 1995లోని సంకేతాలు, వివక్షతో కూడినవిగా ఉన్నాయని, ఇవి భారత రాజ్యాంగంలో పొందు పరిచిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. ముస్లిం మైనారిటీల అణచివేతనే లక్ష్యంగా చేసుకుని వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిందని విమర్శించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిపాలనలో ముస్లిమేతరులపై వివక్ష చూపడం ద్వారా ఆర్టికల్15 (వివక్ష నిషేధం)ను ఉల్లంఘించారన్నారు. భూ యజమానుల అనుమతి లేకుండా వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకునేందుకు, ఆక్రమించుకునేందుకు అనుమతించడం ద్వారా ఆర్టికల్ 21 (జీవించే హక్కు, స్వేచ్ఛ)కు విరుద్ధంగా ఉందన్నారు. గతంలో బీజేపీ మద్ధతు ఇచ్చిన వక్ఫ్ చట్టం 1995, వక్ఫ్ సవరణ చట్టం 2013ల ప్రకారం వక్ఫ్ బోర్డు విధివిధానాలను రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నారు. అయితే ప్రస్తుత సవరణ బిల్లు రాష్ట్రాల అఽధికారాలను తుంగలో తొక్కుతూ అన్ని అధికారాలను కేంద్రమే సొంతం చేసుకుందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరత్తుగా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్‌ఓ ఎ.మలోలను ఆయన చాంబర్‌లో జేఏసీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు కాగజ్‌ఘర్ రిజ్వాన్, సైఫుల్లాబేగ్, షంషుద్ధీన్, అల్లీపీరా, కొర్రపాడు హుసేన్‌పీరా, షేక్ జావీద్, బంగారు బాషా, ఆవాజ్ వలి, యాసిర్ అహమ్మద్, హాజీపీరా, ముఫ్టి మహబూబ్‌రజా పాల్గొన్నారు.
సవరణ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
యునైటెడ్ జేఏసీ నాయకుల డిమాండ్
కలెక్టరేట్ ఎదుట నిరసన