
ఇరువర్గాల ఘర్షణ.. ఒకరు మృతి
శింగనమల: ఇంటి రస్తా విషయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగగా... ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం శింగనమల మండల పరిధిలోని ఇరువెందల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... ఇరువెందల గ్రామంలో ఇంటి రస్తా విషయంలో ప్రభాకర్, మల్లికార్జున ఘర్షణ పడ్డారు. ఇరువురి బంధువులూ కలగజేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఈ క్రమంలో ఘర్షణ తీవ్రతరం కాగా ఇరువర్గాలు కట్టెలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు గాయపడగా... 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ విజయకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సగం ధరకే
వాహనమంటూ కుచ్చుటోపీ
● తాడిపత్రి పోలీసుల అదుపులో మోసగాళ్లు?
● ఇప్పటి వరకూ 53 బైక్‌ల స్వాధీనం
తాడిపత్రి టౌన్: సగం ధరకే అంటూ ప్రజలను మోసం చేసి ద్విచక్ర వాహనాలను అంటగడుతున్న తాడిపత్రికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో తాడిపత్రిలోనే వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు, ఆటోలు విక్రయించినట్లు గుర్తించి, ఇప్పటి వరకూ 53 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వాహనాల కోసం పోలీసులు వల పన్నారు. కాగా, తాడిపత్రి పట్టణంలోని పెద్దబజార్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రధాన నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతనితో పాటు మరో ఇద్దరిని దుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే పూర్తిగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకునేంత వరకూ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున ద్విచక్రవాహనాలు ప్రత్యక్షం కావడంతో పట్టణ వాసుల అవాక్కయ్యారు. కాగా, సగం ధరకే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన వారిలో ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్‌స్టేషన్ చుట్టూ ఉన్న వ్యాపార సముదాయాల యజమానులు, పోలీసులూ ఉన్నట్లు సమాచారం. తాడిపత్రికి చెందిన కొందరు ధనవంతులు సైతం కార్లు, లారీలు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఇరువర్గాల ఘర్షణ.. ఒకరు మృతి