
శింగనమల టీడీపీలో ఆరని కుంపట్లు
శింగనమల: శింగనమల టీడీపీలో కుంపట్లు ఆరడం లేదు. అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ వేదికగా మరోమారు వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శింగనమల నియోజకవర్గంలో పలు కమిటీల నియామకంపై బుధవారం అనంతపురం ఆర్‌అండ్‌బీ బంగ్లాలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఆలం నరసానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ మండలాల్లోనే సమావేశాలు ఏర్పాటు చేసి ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించగా.. ఎమ్మెల్యే శ్రావణి నిరాకరించారు. ఆ విధంగా కాదని, పేర్లను ఇక్కడే తెలిపితే నమోదు చేస్తామని చెప్పడంతో వాదోప వాదాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ ఇప్పటికే మండలాల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్ పోస్టులను మీ వారికే ఇచ్చుకున్నారని, పార్టీలో పని చేసే వారికి ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్టీని నాశనం చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి’ అంటూ ద్విసభ్య కమిటీ సభ్యులతో కలిసి సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. దీనిపై ఎమ్మెల్యే వర్గీయులు కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించడంతో ఉద్రిక్తత నెలకొంది. అరుపులు, కేకలు వేయడంతో గందోరగోళం నెలకొంది. పోలీసులు స్పందించి అక్కడి నుంచి అందరినీ బయటకు పంపించి వేశారు.
అనంతపురం ఆర్‌అండ్‌బీ వేదికగా మరోసారి భగ్గుమన్న విభేదాలు
ఎమ్మెల్యే, ద్విసభ్య కమిటీ వర్గీయుల రచ్చ