
చిట్టీల మోసం కేసులో ముగ్గురి అరెస్ట్
కె.కోటపాడు: చిట్టీల పేరిట మోసం చేసి పరారైన కేసులో మండలంలోని చౌడువాడ గ్రామానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. గురువారం కె.కోటపాడు పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చౌడువాడకు చెందిన పెదిరెడ్ల పద్మజ ఏడేళ్లుగా చిట్టీలను నిర్వహిస్తోంది. ఈమె 15 గ్రూపులను నడుపుతూ గరిష్టంగా రూ.4 లక్షల వరకు చిట్టీలు కట్టించుకునేది. సుమారు 300 మంది వరకూ సభ్యులు ప్రతి నెలా చిట్టీలు కడుతున్నారు. ఇటీవల ఈమె గ్రామంలో కనిపించకుండా పోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చిట్టీల నిర్వాహకురాలు పద్మజతోపాటు, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి కోటిన్నర కలిగిన ఆస్తులను గుర్తించి వశపరుచుకున్నట్లు కోర్టుకు వివరాలు సమర్పించారు. నిందితులు ముగ్గురికి కోర్టు రిమాండ్ విధించినట్టు డీఎస్పీ తెలిపారు.