దేవరాపల్లిలో సీపీఎం నాయకుల రాస్తారోకో
దేవరాపల్లి: అదానీ హైడ్రో పవర్ ప్లాంట్‌కు అనుమతులు ఇచ్చి రైవాడ ప్రాజెక్టు ఉసురు తీస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో గురువారం దేవరాపల్లిలో పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించి, హైడ్రో పవర్ ప్లాంట్‌కు ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ప్రజల తాగునీటి అవసరాలతోపాటు దేవరాపల్లి, కె.కోటపాడు, చోడవరం, మునగపాక, యలమంచిలి, రాంబిల్లి మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుందన్నారు. ఇంతటి కీలకమైన రైవాడ ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియా పెదకోట తముటపు గెడ్డ వద్ద 1800 మెగావాట్లు, చింతలపూడి పంచాయతీ పరిధిలో శారదానదిపై 900 మెగావాట్లు సామర్థ్యం కలిగిన పవర్‌ప్లాంట్ నిర్మాణానికి జీవో నంబర్ 51ను ప్రభుత్వం విడుదల చేయడం దారుణమన్నారు. దీన్ని నిలుపుదల చేయకుంటే జలాశయంపై ఆధారపడ్డ వేలాది ఎకరాలు బీడుగా మారుతాయన్నారు. రైవాడ ఆయుకట్టు రైతులు పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 51ను రద్దు చేయాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బి.టి.దొర, కర్రి సన్యాశినాయుడు, వేచలపు దొంగబాబు, జానా సన్నిబాబు, జె.ఈశ్వరరావు, జన్ని దేముడు, జె.పోతురాజు, గూట్లు దేముడు, జె.దేముడు, బి.నాగేశ్వరరావు, రామకృష్ణ, టి.శంకర్, సిహెచ్. చినదేముడు పాల్గొన్నారు.