
ఎంపీ, ఎమ్మెల్యేలు బీఎన్ రోడ్డులో పర్యటించాలి
● వాహన చోదకుల కష్టాలు తెలుసుకోండి ● ఎన్నికల వాగ్దానం నిలబెట్టుకోండి ● సీపీఎం నాయకులు గోవింద, చిరంజీవి డిమాండ్
రోలుగుంట: పూర్తిస్థాయిలో దెబ్బతిన్న బీఎన్ రోడ్డులో ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రయాణాలు చేసి ప్రయాణికులు, వాహనచోదకులు ఎదుర్కొంటున్న కష్టాలు తెలుసుకోవాలని, అధికారంలోకి రావడానికి రహదారుల అభివృద్ధిపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఎం నాయకులు కె.గోవింద, ఇ.చిరంజీవి డిమాండ్ చేశారు. వారు గురువారం విలేకరులతో మాట్లాడారు. బీఎన్ రోడ్డు పూర్తిగా దెబ్బతిని నూతులను తలపించే విధంగా ప్రమాదకరమైన భారీ గోతులున్నాయన్నారు. రోలుగుంటలో మండల కార్యాలయాల సముదాయం నుంచి స్థానిక ఎంపీపీ పాఠశాల వరకూ భారీ గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుంది. పది రోజులుగా ఈ సమస్య ఉండడంతో ఈ దారిలో ప్రయాణించేవారి గోతుల్లో అదుపు తప్పి బోల్తా పడి ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు మాసాల క్రితం కొత్తకోట నుంచి వస్తున్న ఆకుల వ్యాన్ మండల కార్యాలయం సముదాయం వద్ద గోతిలో పడి అదుపు తప్పి బోల్తాపడిన విషయం విదితమే. ఇక్కడ సమీపంలో గల చర్చి వద్ద గల గోతుల్లో ప్రతిరోజు వాహనాలు బోల్తా పడుతూనే ఉన్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా ఈ రోడ్డుపై ప్రయాణించి సమస్యలు స్వయంగా తెలుసుకొని రోడ్డు బాగు చేయాలని కోరారు.