
తల్లి ఆశీస్సులతోనే ఉన్నత పదవి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ● ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
గోపాలపట్నం: తల్లి దీవెనలతో భారతీయ జనతాపార్టీలో ఇంత ఉన్నతమైన పదవి దక్కడం ఎంతో గర్వంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారిగా గురువారం విశాఖ చేరుకున్న ఆయనకు ఎయిర్ పోర్టులో పార్టీ నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీని అగ్రగామిగా బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను తాను సందర్శించానని, రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తానని తెలిపారు. భవిష్యత్తులో బీజేపీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేస్తానని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం, ఆయన విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా నగరానికి చేరుకున్నారు.