
పార్టీలకతీతంగా జెడ్పీ నిధుల కేటాయింపు
● మంజూరైన పనులను 6 నెలల్లోగా పూర్తి చేయాలి ● జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర
కోటవురట్ల: గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా జెడ్పీ నిధులు కేటాయిస్తున్నట్టు జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని ఆమె గురువారం సందర్శించారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఎంపీడీవో చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ నిధుల వినియోగం, డ్రైనేజీ నిర్మాణాలు, ప్రారంభించని పనుల గురించి ఆరా తీశారు. నిధులు మంజూరైన పనులను 6 నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. చేపట్టే పనులపై తప్పనిసరిగా తీర్మానం చేయాలన్నారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో డ్రైనేజీల నిర్మాణాల కోసం ప్రతి జెడ్పీటీసీకి రూ.20 కోట్లు కేటాయించామని తెలిపారు. కోటవురట్ల మండలానికి జెడ్పీటీసీ నిధులు కాకుండా అదనంగా తన నిధులు రూ.20 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. వీటితో అవసరమైన చోట డ్రైనేజీలు నిర్మించారని తెలిపారు. కిలోమీటరు పొడవున్న బీటీ రోడ్డు శిథిలమైందని, నిధులు కేటాయించాలని వైస్ ఎంపీపీ ఆర్‌ఎస్ సీతారామరాజు తన దృష్టికి తీసుకొచ్చారని, దానికి నిధులు మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు.
జనరల్ ఫండ్ బిల్లులు నిలిపివేసిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు జనరల్ ఫండ్ బిల్లులు నిలిపివేశారని తెలిపారు. ఇలా సుమారు రూ.10 కోట్ల నిధులకు సంబంధించిన బిల్లులు ఆగిపోయాయని తెలిపారు. దీని వల్ల జనరల్ ఫండ్ నిధు లు ఇవ్వాలంటే భయమేస్తోందని, పనులు చేసినవారు ఇబ్బంది పడతారని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన మరుక్షణం కూటమి ప్రభుత్వం వాటిని వెనక్కి లాగేసుకుని తల్లికి వందనం డబ్బులు జమ చేసిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, వైస్ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఆర్‌ఎస్ సీతారామరాజు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ మాజీ చైర్మన్ పైల రమేష్, ఎంపీటీసీ పెట్ల రాంబాబు, పరవాడ జెడ్పీటీసీ పి.ఎస్.రాజు పాల్గొన్నారు.