ఏవోబీలోఅప్రమత్తం
సాక్షి,పాడేరు: మావోయిస్టుల లక్ష్యంగా ఏవోబీలో పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 13మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో పోలీసు నిర్భందం అధికంగా ఉన్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక క్యాడర్ అంతా ఏవోబీతో పాటు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉన్నట్టుగా నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసు యత్రాంగం గాలింపు ముమ్మరం చేసింది. మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే పక్కా సమాచారంతో అప్రమత్తమైన బలగాలు అణువణువు గాలిస్తూ కూంబింగ్ ప్రక్రియను నిరంతరం చేశాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల అటవీ ప్రాంతాలతో పాటు ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట కటాఫ్ ఏరియాపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఒడిశా పోలీసు బలగాల సహకారంతో ఏపీ పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
● మావోయిస్టు పార్టీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక క్యాడర్‌పైనే పోలీసుశాఖ గురి పెట్టింది.తెలంగాణ, ఏపీకి చెందిన కీలక మావోయిస్టు నేతలు ఏవోబీలో ఉద్యమాన్ని మళ్లీ బలోపేతం చేసేందుకు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసుశాఖ మరింత అప్రమత్తమైంది.
● మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహిస్తుండడంతో పోలీసు బలగాలు భారీగానే ఏవోబీలో మోహరించాయి. ఏవోబీలోని పోలీసు అవుట్‌పోస్టుల వద్ద నిఘా పెంచాయి. డోన్లతో గాలింపు ముమ్మరం చేశాయి.
● మావోయిస్టులకు సురక్షితమైనవిగా పేరొందిన ప్రాంతాల్లో కూడా పోలీసు బలగాలు సంచరిస్తున్నాయి.పోలీసు బలగాల గాలింపు చర్యలతో పాటు మావోయిస్టులు కూడా ఇదే ప్రాంతంలో తలదాచుకున్నారనే ప్రచారంతో ఏవోబీ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది.
వై.రామవరం: మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాలు ఈనెల 8 వరకు జరగనున్న నేపథ్యంలో పోలీసు బలగాలు మోహరించాయి. సరిహద్దు అటవీప్రాంతంలోకి వై.రామవరం మీదుగా భారీ ఎత్తున బలగాలు వెళ్లాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అటవీప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. వై.రామవరంతోపాటు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ నైట్ సర్వీసులను వారం రోజులపాటు రద్దు చేసినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు. వై.రామవరం పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద ప్రదేశాల్లో విస్తృతంగా డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు చేస్తున్నారు. ప్రతీపోలీసు స్టేషన్ పరిధిలోని ముఖ్య రాజకీయ నేతలకు, ప్రజా ప్రతినిధులకు లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
జల్లెడ పడుతున్న బలగాలు
మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు
పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో
గట్టి భద్రత
సరిహద్దు ప్రాంతంలో
యుద్ధ వాతావరణం
ఏవోబీలోఅప్రమత్తం


