పీఎంఆర్‌సీ భవన మరమ్మతులకు చర్యలు
రంపచోడవరం: స్థానిక పీఎంఆర్‌సీ భవనాల మరమ్మతులకు సంబంధించి నివేదికలు తయారుచేసి అందించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ తో కలసి పీఎంఆర్‌సీ భవనాలను, యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించారు. పీఎంఆర్‌సీ సమావేశ మందిరంలో ఉన్న జీడిపిక్కల ప్రాసెసింగ్ పరికరాలను వేరేచోట భద్రపరచాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో ఈ మందిరంలో వివిధ రకాల శిక్షణలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పీఎంఆర్‌సీలో కనీసం 50 మంది ఉండేలా వసతి ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రాంగణంలో కార్యాలయాల వివరాలను ఆయన తెలుసుకున్నారు. పీఎంఆర్‌సీ ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఈఈ శ్రీనివాసరావు, ఏపీడీ వెలుగు డేగలయ్య, ఏపీఎం అప్పారావు, డీఈలు నాగరాజు, గౌతమి, వైటీసీ మేనేజర్ సుధీర్ పాల్గొన్నారు.
రాజవొమ్మంగి: మండలంలోని అనంతగిరి, లబ్బర్తి గ్రామాల మీదుగా కలెక్టర్ దినేష్‌కుమార్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. రాజవొమ్మంగి నుంచి మొల్లిమెట్ల, లబ్బర్తి మీదుగా అడ్డతీగల వెళ్లే రహదారి గోతులమయంగా మారిందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రహదారిని కలెక్టర్ పరిశీలించారు. వెంటనే రహదారి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆయనను స్థానికులు కోరారు. అనంతగిరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల పఠనాసామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అర్థం అయ్యే రీతిలో బోధన చేయాలని టీచర్లకు సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం


