చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు
పాడేరు: జిల్లా, మండల స్థాయిల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పరిశ్రమలు, మైన్స్ ఆండ్ జియాలజీ, పౌర సరఫరాలు, గృహ నిర్మాణం, విద్యాశాఖల పని తీరుపై మంగళవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సమీక్షించారు. జిల్లాలో ఖనిజాల లభ్యతపై మండలాల వారీగా సమగ్ర సమాచారం తయారు చేయాలని క్వారీల నిర్వహణలో ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్వహించాలని సూచించారు. సమస్యలు ఉన్న చోట గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయంతో సమస్యలు అధిగమించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలను ప్రొత్సహించేందుకు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా ఔత్సాహికులైన యువతకు వర్క్‌షాపులు నిర్వహించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలన్నారు. గిరిజన ఉత్పత్తులైన కాఫీ, మిరియాలు, పసుపు, చిరు ధాన్యాలు, అల్లం, చింతపండు మొదలైన ఉత్పత్తుల యొక్క పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక డిజిటల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను మండల ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్‌గా నియమిస్తామన్నారు. వారి ద్వారా ప్రతి మండలంలో పది ఇండస్ట్రియల్ యూనిట్లను ఏర్పాటు చేసేలా ఔత్సాహికులను గుర్తించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో రేషన్ లబ్ధిదారులందరికి శతశాతం పంపిణీ చేయాలన్నారు. ధాన్యం సేకరణ చేపట్టేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం సేకరణ చేపట్టిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా రైతు ఖాతాలో నగదు జమ చేయాలన్నారు. గ్రామాల్లో నిర్మితమవుతున్న పీఎంఈవై జన్‌మన్ గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉగాది నాటికి గృహ ప్రవేశాలు జరగాలన్నారు. జిల్లాలో టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలన్నారు. ఈనెల 6 నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి అమలు చేయాలన్నారు. ఈనెల ఐదున మెగా పేరెంట్స్ మీట్‌ను సంబంధి శాఖల అధికారులతో సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. అందుకు తగిన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్, చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్, జిల్లా ప్రణాళిక అధికారి ప్రసాద్, జిల్లా సహకార అధికారి కృష్ణంరాజు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం


