కొనసాగుతున్న శీతల గాలులు
● దట్టంగా కురుస్తున్న మంచు
● నిలకడగా కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా మంచు, చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మంగళవారం అరకువ్యాలీలో 13.9, జి.మాడుగులలో 14.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి డుంబ్రిగుడలో 14.8, చింతపల్లిలో 15.0, పాడేరు, హుకుంపేటలో 15.1, ముంచంగిపుట్టు, పెదబయలులో 15.7, కొయ్యూరులో 17.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు.
● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 17.7, మారెడుమిల్లి 18.4, రాజవొమ్మంగిలో 18.7 ,అడ్డతీగలలో 18.8, రంపచోడవరంలో 19.4, గంగవరంలో 23.4 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ తెలిపారు. చింతూరు డివిజన్ చింతూరులో 20.3, ఎటపాకలో 21.4 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
● కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నా సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. దీంతో పిల్లలు, వృద్ధులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు మంచు తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. వాహన చోదకులు హెడ్‌లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు.


