
పోలీసు భవనాలకు రాజకీయ గ్రహణం
● నిర్మించి నెలలు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోని వైనం ● హోంమంత్రి, అసెంబ్లీ స్పీకరు మధ్య సమన్వయలోపమే కారణం?
నాతవరం: పోలీసుస్టేషనన్లకు నూతనంగా నిర్మించిన అదనపు భవనాల ప్రారంభోత్సవానికి రాజకీయ గ్రహణం వెంటాడుతోంది. నాతవరం పోలీసుస్టేషన్‌కు నూతన భవన నిర్మాణం పనులు పూర్తి చేసి గత డిసెంబరులోనే ప్రారంభించడానికి పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. గొలుగొండ మండలంలో కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీసుస్టేషన్లకు రెండు చోట్ల అదనపు భవనాలు నిర్మించినా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. నియోజకవర్గంలో నాతవరం, గొలుగొండ మండలాల్లో పోలీసుస్టేషన్లకు నిర్మించిన అదనపు భవనాలు మార్చి నెలలోనే ప్రారంభించేందుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్వయంగా భవనాలను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత ఇతర ఉన్నతాధికారులతో ఈ భవనాల ప్రారంభోత్సవం ఉంటుందని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ దిశగా మూడు పర్యాయాలు ఎస్‌ఐ సిహెచ్.భీమరాజు, రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ఆఖరు సమయంలో ప్రారంభోత్సవాలు వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర పోలీసుశాఖ ఆధ్వర్యంలో అదనపు భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఆయా భవనాల ప్రారంభోత్సవాలకు హోంమంత్రి వంగలపూడి అనిత విచ్చేస్తారని అంటున్నారు. నాతవరం, గొలుగొండ మండలాలు అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఆయన ఆహ్వనం మేరకే హోంమంత్రి తన నియోజకవర్గంలో పోలీసు స్టేషన్ అదనపు భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సి ఉంది. అయితే స్పీకర్, హోంమంత్రి మధ్య సమన్వయ లోపం కారణంగా భవనాలు ప్రారంభోత్సవంలో జాప్యం జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. పోలీసుస్టేషన్లకు అదనపు భవన నిర్మాణాలకు 2018లో అప్పటి ప్రభుత్వం రూ.2.50 కోట్లు చొప్పున మంజూరు చేసింది. భవనాల పనులు ప్రారంభించాక కరోనా కారణంగా చాలా కాలంగా పనులు నిలిపివేశారు. నిర్మాణ టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు టీడీపీ నేత కావడంతో గత ప్రభుత్వంలో పనులు పూర్తి చేస్తేవె వైఎస్సార్‌సీపీకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో జాప్యం చేశాడు. ప్రస్తుతం భవనాల నిర్మాణం పూర్తయినా రాజకీయ గ్రహణం చోటు చేసుకుంది. దీంతో నెలల తరబడి నూతన భవనాలు ప్రారంభోత్సవాలకు నోచుకోలేదు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న, నాతవరం, గొలుగొండ మండలాల పర్యటనకు తరుచూ విచ్చేస్తున్నారు. నెలల తరబడి అలంకార ప్రాయంగా కళ్ల ముందే కన్పిస్తున్నా ఆ భవనాల ప్రారంభోత్సవం వైపు కన్నెత్తి చూడలేదు. ఈ విషయంపై నాతవరం ఎస్‌ఐ సిహెచ్.భీమరాజును వివరణ కోరగా మూడుసార్లు భవనం ప్రారంభోత్సవాలకు కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అనివార్య కారణాల వల్ల ఆఖరు సమయంలో రద్దయ్యాయన్నారు.
రూ.కోట్ల వ్యయంతో నాతవరం, గొలుగొండ, కేడీపేట స్టేషన్లకు అదనపు భవనాలు