
సమస్యలు పరిష్కరించాలని వినతి
కూనవరం: కాంట్రాక్టర్ల సౌలభ్యం కోసం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం, పోలవరం ముంపుతో సర్వం కోల్పోతున్న నిర్వాసితుల నష్ట పరిహారం మాత్రం పెంచడం లేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మేకల నాగేశ్వరరావు అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కె.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతీ నిర్వాసితుడికి సంపూర్ణ న్యాయం చేస్తామని నమ్మబలికి అధికారం చేపట్టాక ప్రజలను గందరగోళంలో ముంచిందన్నారు. కాకిలెక్కల కాంటూరుతో సంబంధం లేకుండా మండలంలో మొత్తం గ్రామాలు యూనిట్‌గా తీసుకొని కుటుంబానికి రూ.15 లక్షలు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు బొర్రయ్య, సీతారామయ్య, నాగమణి, శ్రీనివాసరావు, ఈశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.