
ఆర్‌అండ్‌ఆర్ ఇచ్చి తరలించండి
కూనవరం: ఏటా సంభవించే వరదల వల్ల ఎన్నో విధాలుగా నష్టపోతున్నామని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకే జీ ఇచ్చి తరలిస్తే ఈ బాధలు ఉండవని సర్పంచ్‌లు, పలు పార్టీల నేతలు విన్నవించారు. స్థానిక సినిమాల్‌లో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన వరద సమీక్ష సమావేశంలో పలువురు మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా సోలార్ లైట్లు ఉపయోగించాలని, అత్యవసర రోడ్లు బాగు చేయాలని, అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని వారు కోరారు. ఈసందర్భంగా పీవో మాట్లాడుతూ ఈ నెల 30నాటికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫేజ్ 1బీ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ డ్రాఫ్ట్ అవార్డ్ నోటిఫికేషన్ పూర్తి చేస్తామన్నారు. గోదావరి వరదల సమాచారం ఎప్పటికప్పుడు ప్రతిఒక్కరికీ తెలిసేలా యాప్ రూపొందించామని చెప్పారు. ఏ సమస్య అయినా ఆ యాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు. వరదల సమయంలో పై అంతస్తు లేని లాంచీలను ఉపయోగించాలని కోరారు. వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులు ఇచ్చిన సలహాలు, సూచనలను మినిట్‌లో నమోదు చేయించారు. ఈ సమావేశంలో ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్ మల్లంపల్లి హేమంత్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, తహసీల్దార్ కె. శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంజనేయ ప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ భానుప్రకాష్, సివిల్‌సప్‌లై ఆఫీసర్, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ముందస్తుగా ప్రణాళికలతో ఆదుకోండి
వీఆర్‌పురం: ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు కోరారు. మంగళవారం రేఖపల్లిలో మండల పరిషత్ ప్రాంగణంలో తహసీల్దార్ సరస్వతి అధ్యక్షతన గోదావరి వరదలపై నిర్వహించిన సమీక్షలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బఫర్ స్టాక్, నిత్యావసర సరకులు అందుబాటులో ఉంచడమే కాకుండా పడవలు, కిరోసిన్, డీజిల్‌ను సిద్ధం చేయాలని వారు కోరారు. వీఆర్‌పురం బీసీ కాలనీ నుంచి రేఖపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టి, కల్వర్టుల ఎత్తు పెంచితే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. వరద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో గుడారాలు వేసుకునేందుకు రైతులు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ వరద సహాయ కేంద్రాల్లో ఉన్న వారికి అటవీ అధికారులతో మాట్లాడి అటవీ ప్రాంతంలో తాగునీటి బోర్లు, మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. సెల్ ఫోన్ టవర్లు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి, జెడ్పీటీసీ వాళ్ల రంగరెడ్డి, సర్పంచ్‌లు పులి సంతోష్ కుమార్, సోడె నరసమ్మ, పిట్టా రామారావు, వడ్డనపు శారద, ఎంపీటీసీలు పునెం ప్రదీప్ కుమార్, బంధం విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో పుల్లయ్య, ఎస్‌ఐ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
అందుబాటులో లేకుంటే చర్యలు
వరదల సమయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోతే చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో అపూర్వభరత్ హెచ్చరించారు. ముంపునకు గురయ్యే గ్రామాలను మంగళవారం ఆయన పరిశీలించారు. దీనిలో భాగంగా శ్రీరామగిరి, వడ్డెగూడెం, చింతరేగిపల్లి, రాజుపేట, రామవరం గ్రామాలను సందర్శించారు. అధికారులకు సూచనలు చేశారు.
చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌కు వరద బాధితుల వినతి

ఆర్‌అండ్‌ఆర్ ఇచ్చి తరలించండి