
ఆశ్రమ విద్యార్థిని ఆకస్మిక మృతి
జి.మాడుగుల: మండలంలోని బంధవీధి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మర్రి లక్ష్మి మృతి చెందింది. సొలభం పంచాయతీ చరుబయలు గ్రామానికి చెందిన పీవీటీజీ తెగకు చెందిన ఈమె 8వ తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం ఆమె తరగతి గదికి వెళ్తూ అకస్మాత్తుగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరింది. దీంతో ఆమెను ఉపాధ్యాయులు, నిర్వాహకులు హుటాహుటిన పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేస్తున్నారు.
మృతికి కారణాలను తెలుసుకున్న
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
పాడేరు : బందవీధి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మర్రి లక్ష్మి మృతికి గల కారణాలను వైద్యులనుంచి స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలుసుకున్నారు. ఆమె మరణ వార్తను తెలుసుకున్న ఆయన మంగళవారం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. మార్చురీలోని విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. అక్కడి నుంచి బందవీధి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. 8వ తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. లక్ష్మి మృతికి కారణాలను తెలుసుకున్నారు. వసతి గృహంలో అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు సిక్ లీడర్ మాత్రలు ఇస్తోందని వారు వివరించారు.
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. గత ఏడాది పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం బారిన పడి మృతి చెందినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాల్లో హెల్త్ వలంటీర్లను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చి ఏడాది పూర్తయిందన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే పట్టించుకునే నాథుడు కరువయ్యారన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి పాఠశాలలు, వసతి గృహాల్లో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాల్లో హెల్త్ వలంటీర్లను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆశ్రమ విద్యార్థిని ఆకస్మిక మృతి

ఆశ్రమ విద్యార్థిని ఆకస్మిక మృతి