
రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం
● కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్
పాడేరు: రెడ్‌క్రాస్ సేవలు మరింత విస్తృతం చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం ప్రపంచ రెడ్‌క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు, కలెక్టర్ ఏఎస్‌దినేష్‌కుమార్ జిల్లా చైర్మన్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జీన్‌హేన్రి దునాట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పిచారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 22 మండలాల్లో రెడ్‌క్రాస్ సేవలు కార్యవర్గం నిర్విరామంగా కొనసాగిస్తుందన్నారు.సభ్యత్వ నమోదు కార్యక్రమం మరింత వేగవంతం చేసి అన్ని శాఖల ఉద్యోగులు రెడ్‌క్రాస్ సొసైటీకి సహకరించాలని కోరారు. సొసైటీ భవన నిర్మాణానికి 10సెంట్లు స్థలం కేటాయించామన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు కృషి చేయాలన్నారు. వృద్ధులు, పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్ర, డాక్టర్ రాఘవేంద్ర, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్రా నాగరాజు, వైస్ చైర్మన్ గంగరాజు, కార్యదర్శి గౌరిశంకర్, కోశాధికారి సూర్యారావు, జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, లైఫ్ మెంబర్లు పాల్గొన్నారు.