
దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి
డాబాగార్డెన్స్: అఖిల పక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఈనెల 20వ తేదీ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం జగదాంబ జంక్షన్ సమీపాన గల సిటు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. లేబర్‌కోడ్‌లు వస్తే సంఘం పెట్టుకునే హక్కు పోతుందన్నారు. చైన్నెలోని సామ్‌సంగ్ కంపెనీలో కార్మికులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న యూనియన్‌ను రిజిస్టర్ చేయకుండా యాజమాన్యం, ప్రభుత్వం అడ్డుకున్నాయన్నారు. లేబర్‌కోడ్ అమల్లోకి వస్తే కార్మికులు ఏ కష్టం వచ్చినా సమస్య పరిష్కారానికి సమ్మె చేయలేరని, అలా చేస్తే ఒక రోజు సమ్మెకు 8 రోజుల వేతనం కోల్పోతారన్నారు. నాయకులను జైల్లో పెట్టి నిర్భందించవచ్చని, యూనియన్ రిజిస్ట్రేషన్, గుర్తింపు రద్దు చేయవచ్చని, లక్షలాది రూపాయల జరిమానా విధించవచ్చన్నారు. మరోవైపు ఇప్పటి వరకు కార్మికుల పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్ చెల్లించని యజమానులకు జైలు శిక్ష పడేదని, దానికి భయపడి కట్టేవారన్నారు. యజమానులు జైలుకెళ్తే బెయిల్ రావాలంటే 50 శాతం చెల్లించాల్సి ఉండేదన్నారు. కానీ లేబర్ కోడ్‌లో యజమానుకు ఈ శిక్షలు ఎత్తివేశారన్నారు. కార్మికుల పాలిట శాపంగా మారే లేబర్‌కోడ్ల రద్దుకు పోరుబాట పట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రమణబాబు, సురేష్, హెచ్‌ఎంఎస్ నాయకుడు మంగయ్య నాయుడు, సిటు గౌరవ అధ్యక్షుడు వీఎస్ పద్మనాభరాజు, త్రినాథరావు, వీడీఎల్‌బీ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి. లక్ష్మణరావు, సీఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షుడు కనకారావు, ఐఎన్‌టీయూసీ నాయకుడు బి. వెంకట్రావు, సిటు కార్యదర్శి బి. జగన్ తదితరులు పాల్గొన్నారు.