
స్టార్ రేటెడ్‌తోనే ఇంధన పొదుపు, కాలుష్య నివారణ
ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ చంద్రం
సాక్షి, విశాఖపట్నం : భారత ప్రమాణాల బ్యూరో(బీఈఈ) సూచించిన స్టార్ రేటెడ్ విద్యుత్ పరికరాల వినియోగంతో ఇంధన పొదుపుతో పాటు కర్బన ఉద్గారాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్(ఫైనాన్స్) చంద్రం అన్నారు. డిస్కమ్‌ల సామర్థ్య నిర్మాణం, డిమాండ్‌కు అనుగుణంగా ఇంధన సామర్థ్య నిర్వహణ(డీఎస్‌ఎం) అంశంపై నగరంలోని ఓ హోటల్‌లో గురువారం సదస్సు నిర్వహించారు. ఈపీడీసీఎల్, బీఈఈ, ఐసీఎఫ్ సహకారంతో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు డీఎస్‌ఎంకి ఉపయుక్తమయ్యే విధానాలపై చర్చించారు. బీఈఈ, ఐసీఎఫ్ కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం తగ్గించడమే లక్ష్యంగా గృహ విద్యుత్ పరికరాలను ప్రారంభించారు. అనంతరం డైరెక్టర్ చంద్రం మాట్లాడుతూ డీఎస్‌ఎం సూచించిన పరికరాలను వినియోగిస్తే విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చన్నారు. ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఓఎస్‌డీ శివరామ్‌కుమార్ మాట్లాడుతూ విశాఖలో ప్రారంభించిన కార్యక్రమం ఏపీ, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లోని డిస్కమ్‌లలోనూ సాగుతుందన్నారు. గృహ విద్యుత్ రంగంలో 10 లక్షల ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, 8 లక్షల బీఎల్‌డీసీ ఫ్యాన్‌ల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఐసీఎఫ్ కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్‌లిమిటెడ్ ఎండీ గురుప్రీత్ చుగ్ తెలిపారు. వాణిజ్య రంగంలో 4 లక్షల ట్యూబ్‌లైట్లు, 1.6 లక్షల ఫ్యాన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈపీడీసీఎల్ ఎనర్జీ కన్జర్వేషన్ సోలార్ ఎనర్జీ సీజీఎం శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో బీఈఈ, ఈపీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.