
‘స్థానికులకు’ ఉపాధి కలేనా..!
అచ్యుతాపురం రూరల్ : పరిశ్రమలకు గ్రామాల్లో భూములు సేకరించినప్పుడు నిర్వాసితులకు ఆర్.కార్డులు ఇస్తామని, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో శిక్షణ ఇచ్చి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి కలెక్టర్ సమక్షంలో అగ్రిమెంటు చేసుకున్నారు. కానీ నేటికీ అమలు కాలేదని కార్మిక సంఘాల నాయకులంటున్నారు. మత్స్యకార గ్రామాల యువతీ యువకులను పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించట్లేదని వాపోతున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాల కారణంగా మత్స్య సంపద కోల్పోయి, స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో అవకాశాలు లేక మత్స్యకార యువకుల జీవనం చాలా దుర్భరంగా మారింది.
వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి రైతుల నుంచి వేలాది ఎకరాలు తీసుకుని నామ మాత్రంగా పరిశ్రమలు నెలకొల్పి, రాయితీలు పొందాక కుంటి సాకులతో అర్ధంతరంగా మూసేస్తున్నారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని ఎందరో నిరు పేద కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇక నడుస్తున్న పరిశ్రమలూ కార్మికులకు చాలీచాలని వేతనాలు ఇస్తున్నాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనం పెంచాల్సి ఉన్నప్పటికీ, గత 15 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుత ధరలకు అనుగుణంగా కనీసవేతనం రూ.26వేలు ఎక్కడా అమలు కావట్లేదని కార్మికులు వాపోతున్నారు.
సెజ్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులు తమ జీవితాలు బాగుపడతాయన్న ఆలోచనతో వేల ఎకరాలు సెజ్ పరిశ్రమలకు ధారపోశారు. భవిష్యత్తులో తమ పిల్లల జీవితాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సంతోషంగా గడిచిపోతుందని అనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. స్థానికంగా పరిశ్రమలు వస్తే విద్యార్హతను అనుసరించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయనుకున్న నిర్వాసితుల కల కలగానే మిగిలింది. ప్రస్తుతమున్న పరిశ్రమల్లో స్థానికేతరులకు తప్ప స్థానికంగా ఉన్న నిర్వాసిత రైతుల పిల్లలకు ఉద్యోగ,ఉపాధి కల్పనలో పరిశ్రమల యాజమాన్యాలు చొరవ చూపించట్లేదు.
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 560 ఎకరాల్లో భూమిని సేకరించారు.వీటిలో ఇప్పటివరకూ 208 పరిశ్రమలు ఏర్పాటు చేశారు.
ఈ రెండు మండలాల్లో 27 గ్రామాలకు చెందిన 5,600 నిర్వాసిత కుటుంబాలను దిబ్బపాలెం, వెదురవాడ ఆర్ అండ్ ఆర్‌కాలనీలకు తరలించారు.
నిర్వాసుతులందరూ కూలీలుగా పనిచేస్తున్నారు.
ఈ గ్రామాల్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు.
వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2000 మంది మహిళలకు ఉపాధి కల్పించారు.
నిర్వాసితులకు దక్కని ఉపాధి అవకాశాలు
అర్ధంతరంగా మూతపడుతున్న పరిశ్రమలు
రోడ్డున పడుతున్న కార్మికులు
భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమ యాజమాన్యాలు
విధుల్లో ఉన్న కార్మికులకు చాలీ చాలని వేతనాలు