
‘108’ నిర్లక్ష్యంతో మానసిక దివ్యాంగుడు మృతి
జి.మాడుగుల: 108 కాల్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యంతో మండలంలో లువ్వాసింగి పంచాయతీ కేంద్రానికి చెందిన సూరిబాబు(55) అనే దివ్యాంగుడు మృతి చెందినట్టు గ్రామస్తులు, బంధువులు ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సూరిబాబు మానసిక దివ్యాంగుడు. మరొకరి సాయం లేనిదే ఏ పనీ చేయలేడు. ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్నాడు.
శనివారం ఉదయం నుంచి సూరిబాబు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయన అల్లుడు ఆదినారాయణ 108 వాహనానికి 10.30 గంటలకు ఫోన్ చేశారు. వాహనం అందుబాటులో లేదని, ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలించాలని కాల్‌సెంటర్ సిబ్బంది సమాధానం చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సూరిబాబును ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించే అవకాశం లేకపోవడంతో సాయంత్రం 4.30గంటల వరకు 108వాహనం కోసం వేచి చూశారు. ప్రయోజనం లేకపోవడంతో మరోకసారి 108వాహనానికి ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో సూరిబాబు మృతిచెందాడని ఆయన అల్లుడు ఆదినారాయణ తెలిపారు. మృతి చెందిన సమాచారానికి 108 సిబ్బందికి తెలియజేయడంతో అప్పుడు స్పందించి సమీపంలో గల ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌ను పంపించారని ఆయన చెప్పారు. సూరిబాబు మృతికి 108 కాల్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. సకాలంలో వాహనం పంపి ఉంటే సూరిబాబు బతికేవాడని వారు తెలిపారు.
సాయంత్రం వరకూ నిరీక్షించినాఅంబులెన్స్ రాలేదని బంధువుల ఆరోపణ