
గిరిజన గ్రామాల్లో వెలుగులే లక్ష్యం
● అరకు ఎంపీ తనూజరాణి ● ఎంపీ నిధులు రూ.13.94 లక్షలతో ఎల్‌ఈడీ వీధి దీపాల పంపిణీ
డుంబ్రిగుడ: గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపడమే ప్రధాన లక్ష్యమని అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో ప్రేమ్‌సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్‌ఈడీ వీధి దీపాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ఎంపీ నిధులతో మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.13.94 లక్షల వ్యయంతో 256 ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటుచేశామన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలకు రూ.40 లక్షలతో అందజేస్తున్నామన్నారు. తన విజయానికి మండలంలోని ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడ్డారన్నారు. ప్రజా ప్రతినిధులను భాగస్వామలు చేసి పంచాయతీలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ జానకమ్మ, వైస్ ఎంపీపీలు శెట్టి ఆనందరావు, పి లలిత, మండల ప్రత్యేకాధికారి నందు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇలావుండగా అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో కలిసి ఎంపీ తనూజరాణి అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేశారు. అభివృద్ధికి ఎంపీ నిధులు తోడ్పాటు అవుతాయని ఎమ్మెల్యే మత్స్యలింగం పేర్కొన్నారు.