ముంచంగిపుట్టు: మండలంలోని కర్రిముఖిపుట్టు పంచాయతీ కంగువీధి, నందిమెట్ట గ్రామాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రను ఆదివారం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఎం జన్‌మన్ గృహాల బిల్లుల మంజూరుకు హౌసింగ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు సుందరావు, భగత్‌రాం, మంగన్న తదితరులు తమ సమస్యను నేతలకు విన్నవించారు. ఈ సందర్భంగా నాయకులు నారాయణ, జీనబంధు మాట్లాడుతూ గృహాల నిర్మాణాల కోసం గిరిజనులు అప్పులు చేస్తున్నారన్నారు. బిల్లుల మంజూరు పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న హౌసింగ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.