సాక్షి,పాడేరు: వేసవిలోను జిల్లాలో దట్టంగా పొగమంచు కురిసింది. పాడేరు, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 8గంటల వరకు పొగమంచు ఎక్కువగా కురిసింది. వాహనచోదకులు లైట్లు వేసుకుని వాహనాలు నడిపారు. అరకులోయలో 10.7 డిగ్రీలు, చింతపల్లిలో 15 డిగ్రీలు, పాడేరులో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు వేకువజామున నమోదయ్యాయి. అయితే ఉదయం 9గంటల తరువాత భానుడు విజృంభించాడు. మధ్యాహ్నం సమయానికి ఎండ చుర్రుమంది. పాడేరు, అరకు సంతల్లో గిరిజనులు వ్యాపారులు అధిక ఎండతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాహార్తి తీర్చుకోడానికి శీతల పానీయాలను ఆశ్రయించారు. సాయంత్రం ఐదుగంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. దీంతో జిల్లా కేంద్రం పాడేరులోని అన్ని రోడ్లలో జనసంచారం తక్కువగా ఉంది. పాడేరులో జరిగిన సంత బోసిపోయింది. చిరువ్యాపారులు గొడుగులను ఆశ్రయించారు. పాడేరులో 36, రంపచోడవరంలో 35.7 డిగ్రీలు, అరకులోయలో 34.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉదయం మంచు.. మధ్యాహ్నం మండే ఎండ
ఉదయం మంచు.. మధ్యాహ్నం మండే ఎండ