అరగంటలో గమ్యం చేరేలోగా.. | - | Sakshi
Sakshi News home page

అరగంటలో గమ్యం చేరేలోగా..

Mar 21 2025 1:09 AM | Updated on Mar 21 2025 1:03 AM

పాడేరు: నాలుగు రోజులు సెలవు తీసుకొని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుదామని ఎంతో ఆశతో ఇంటికి బయలుదేరిన యువకుడు ఇంకో అరగంటలో గమ్యం చేరుకుంటాడనగా మృత్యువు పాలయ్యాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పాడేరు–చోడవరం ప్రధాన రహదారి మినుములూరు సమీపంలో మలుపు వద్ద జరిగింది. హుకుంపేట మండలం దొందిరాప గ్రామానికి చెందిన సొమెలి చిరంజీవి, గౌరమ్మ దంపతుల రెండో కుమారుడు సొమెలి వెంకటరమణ (22) విశాఖపట్నంలోని ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. మరో అరగంటలో గ్రామానికి చేరుకునే సమయంలో పాడేరు–చోడవరం ప్రధాన రహదారి మినుములూరు సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్‌ బలంగా ఢీకొట్టింది. తలకు హెల్మెట్‌ లేకపోవడంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంఘటనకు కారణమైన వ్యాన్‌ డ్రైవర్‌ వెంటనే అక్కడి నుండి పరారయ్యాడు. సంఘటనకు కారణమైన వ్యాన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సూర్యనారాయణ విలేకరులకు తెలిపారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్‌

స్వగ్రామానికి వస్తున్న యువకుడి మృతి

మినుములూరు మలుపు వద్ద ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement