సీలేరు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పరిపాలనను చూసి కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని శాసనసభ్యుడు విశ్వేశ్వరరాజు అన్నారు. గురువారం దారకొండ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి పథకాలు ఇవ్వడంలో చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాలను ప్రజలకు నేరుగా ఇంటికి పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనని, అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా సూపర్ 6 పథకాల్లో ఒకటీ అమలు చేయకపోగా, గత ప్రభుత్వం తప్పులు చేసింది అనడం మానుకోవాలని అన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా గిరిజనులకు అన్యాయం చేస్తోందని, అభివృద్ధిని పక్కన పెట్టి నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. మళ్లీ రానున్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని కార్యకర్తలు, పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
గంగవరం వంతెన పునరుద్ధరణ ఎప్పుడుః
దారకొండ పంచాయతీలో వరదల్లో కొట్టుకుపోయిన గంగవరం వంతెనను నేటికీ నిర్మించకపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అన్నారు. వంతెన పరిశీలించిన ఆయన పనులు చేపట్టనందుకు అధికారులపై మండిపడ్డారు. తక్షణమే వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. దారకొండ, గుమ్మిరేవుల, దుప్పులవాడ పంచాయతీ మారుమూల ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు ఆయనను కలిసి మంచినీరు, సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో ఆయన వెంటనే సంబంధిత అదికారులతో మాట్లాడి బోర్లు వేసేలా చర్యలు తీసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ కుమారి, దామనాపల్లి సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.
కూటమి ప్రభుత్వం జగనన్నను చూసి సిగ్గు తెచ్చుకోవాలి
గిరిజన గ్రామాల్లో అభివృద్ధి శూన్యం
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ధ్వజం
హామీలు గుప్పించి చేతులెత్తేశారు..