కొయ్యూరు: తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి వెల్లడించారు. ఏటా ఉమ్మడి విశాఖ జిల్లాలో రూ.6 కోట్లు తాగునీటి ట్యాంకుల నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. ఆయన గురువారం ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుంచి మండల పరిషత్‌లకు ఇస్తున్న 15 శాతం నిధులు వచ్చే ఏడాది నుంచి ఐదు శాతం పెరిగి 20 శాతానికి చేరుతాయన్నారు. అదేవిధంగా జల్లా పరిషత్ నిధులు 15 నుంచి పది శాతానికి తగ్గుతాయన్నారు. పీ–4 సర్వే పూర్తి కావస్తుందన్నారు. దీనిలో పేదల్లో అత్యంత పేదలను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్నారు. కొయ్యూరు తాగునీటి ట్యాంకును పరిశీలించి, క్లోరినేషన్‌తో పాటు ఇతర అంశాలపై ఆయన ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సాయిరాం నుంచి వివరాలు తెలుసుకున్నారు. నాలుగు గ్రామాలకు తాగునీరు అందించే ట్యాంకు కొయ్యూరు పంచాయతీలో ఉన్నా కొయ్యూరుకు నీరు రావడం లేదని సర్పంచ్ మాకాడ బాలరాజు సీఈవో దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జేఈని ఆదేశించారు. దీనికి అవసరమైన నిధులు ఇస్తామన్నారు. ఎంపీపీ బడుగు రమేష్ సీఈవో దృష్టికి తాగునీటి సమస్యను తీసుకెళ్లారు.
సంపద కేంద్రాలను వినియోగంలోకి తేవాలి
చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని సీఈవో ఆదేశించారు. రాజేంద్రపాలెంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి సచివాలయాన్ని తనిఖీ చేశారు. సర్పంచ్ పి.సింహాచలం సచివాలయ భవనం పూర్తి కాని విషయం ఆయన దృష్టిలో ఉంచారు. జెడ్పీ అతిథిగృహం మరమ్మతులకు రూ.20 లక్షలు విడుదల చేస్తామని, నాణ్యమైన విధంగా పనులు చేపట్టాలని ఆయన జేఈని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రసాద్, కార్యదర్శులు సీఈవోను సన్మానించారు.
జీకే వీధి మండలంలో పర్యటన
గూడెంకొత్తవీధి: ఘన సంపద కేంద్రాలను అన్ని పంచాయతీల్లో వినియోగంలోకి తీసుకురావాలని జెడ్పీ సీఈవో నారాయణమూర్తి అన్నారు. గురువారం ఆయన గూడెంకొత్తవీధిలో పర్యటించారు. ముందుగా చింతపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పారిశుధ్యం మెరుగుపరచడంతోపాటు తాగునీటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీలకు అదనంగా నిధులను మంజూరు చేయాలని ఎంపీపీ బోయినకుమారి సీఈఓను కోరారు. ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ పాపారావు పీఆర్ జేఈ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటా రూ.6 కోట్ల వ్యయం
గ్రామసభల ద్వారా పేదల్లో
అత్యంత పేదల ఎంపిక
జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి