శృంగవరపుకోట: శిశువు మృతికి వైద్యులే కారణమంటూ మృత శిశువుతో తల్లి, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన ఎస్.కోట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మ గ్రామానికి చెందిన అరుణ్ భార్య శాంతి ప్రసవం కోసం ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఉదయం 10 గంటల సమయంలో ఆపరేషన్ కోసం ఆస్పత్రి థియేటర్‌లోకి గర్భిణిని తీసుకెళ్లారు. అప్పటివరకు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పిన వైద్యులు కొద్ది సేపటికి మాట మార్చి శిశువు మృతిచెందినట్టు చెప్పారు. దీనిపై అరుణ్‌తో పాటు బంధువులు ఆందోళనకు గురయ్యారు. సకాలంలో వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఆడ శిశువు చనిపోయిందంటూ శాంతితో పాటు బంధువులు, మృతశిశువుతో కలిసి ఆస్పత్రి ఆవరణలో బైఠాయించారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీల స్పందిస్తూ ప్రైవేట్‌స్కాన్ సెంటర్‌లో చేయించిన స్కాన్ రిపోర్టులో బిడ్డ హార్ట్‌బీట్ బాగుంది. సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించామని చెప్పారు. ప్రసవం అవుతున్నప్పుడు బిడ్డ మెడకు రెండు పేగులు చుట్టుకున్నట్టు వైద్యులు చూశారని, బిడ్డ బయటకు వస్తున్న కొద్దీ పేగులు మెడకు బిగిసుకోవడంతో ఊపిరి ఆడక శిశువు మరణించిందని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని చెప్పారు.