ముంచంగిపుట్టు: మండలంలోని బాబుశాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది.ఇప్పటికే ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఏడుగురు చిన్నారులను ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. సోమవారం బల్లుగూడలో మరికొంత మంది చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. జ్వరంతో పాటు దగ్గు,జలుబు,శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు.వీరిని వైద్య సేవలు నిమిత్తం సీహెచ్‌సీకి తరలించేందుకు వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లగా వారిని చూసి కొంతమంది గ్రామస్తులు అటవీ ప్రాంతం వైపు చిన్నారులతో పారిపోయారు.మరికొంత మంది వైద్యసేవలు వద్దు అంటూ భీష్మించి కూర్చున్నారు. నాటు వైద్యం,పసర మందులు వాడతామని గ్రామ గిరిజనులు చెబుతూ ఉండడంతో వాటివల్ల కలిగే అనర్థాలను వివరించి, కొన్ని గంటల పాటు వైద్య సిబ్బంది చిన్నారుల తల్లిదండ్రులను ప్రాధేయపడి 12 మంది చిన్నారులను ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి అతికష్టం మీద తరలించారు.ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చేది లేదని వైద్య సిబ్బందితో గొడవపడడంతో సిబ్బంది ఈవిషయాన్ని ఫోన్‌లో ఎంపీడీవో సూర్య నారాయణమూర్తికి తెలియజేశారు. వైద్య సేవలు అందిస్తేనే మీ పిల్లల పరిస్థితి బాగు పడుతుందని ఆయన ఫోన్‌లో తల్లిదండ్రులతో చాలా మాట్లాడి నచ్చజెప్పడంతో అంబులెన్స్‌లో సాయంత్రం 7గంటలకు ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తీసుకువచ్చా రు. 21 మంది చిన్నారులకు సీహెచ్‌సీ వైద్యులు గీతాంజలి,సంతోష్‌లు వైద్య సేవలు అందిస్తున్నారు.వీరిలోకొంతమంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో గంట గంటకు పరీక్షలు చేస్తూ, వైద్యం అందిస్తున్నారు.
సీహెచ్‌సీకి ఇప్పటి వరకు 21 మంది తరలింపు
వైద్య సేవలకు ముందుకు రాని గ్రామస్తులు
ప్రాధేయపడి సీహెచ్‌సీకి తరలించిన వైద్య సిబ్బంది
బల్లుగూడలో ఆందోళనకరంగా చిన్నారుల పరిస్థితి