● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
హుకుంపేట: విద్యార్థులు ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అరకు ఎమ్మె ల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల,గూడ బాలికల ఉన్నత పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ కలిగి, చదువుపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉపాధ్యాయుడిగా ఎదిగి, ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చానని, దానికి కారణం చిన్నతనం నుంచి చదువుపై శ్రద్ధ చూపించడమేనని చెప్పారు. టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
మెనూ సక్రమంగా
అమలు చేయకపోతే సహించేది లేదు
గూడ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. మెనూ సక్రమంగా అమలు కాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఆదివారం బిర్యాని,చికెన్ కర్రి,మజ్జిగా పెట్టాల్సి ఉండగా అవి ఏమిలేకుండా కేవలం గుడ్డు కూరతో సరిపెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను ఈ పాఠశాలను సందర్శించి, హెచ్చరించినప్పటికీ మార్పు రాలేదన్నారు. ఇటీవల ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయినట్టు తనకు తెలిసిందని, అయినా కూడా పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడడంలేదన్నారు. ఈ విషయంపై డిప్యూటీ డీడీ రజనితో ఫోన్‌లో మాట్లాడారు. వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.