
మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు దూకుడు పెంచారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వారి కార్యకలాపాలకు చెక్ పెడుతున్నారు. డ్రోన్లతో కదిలికలు పసిగట్టి కుట్రలను భగ్నం చేస్తూ పైచేయి సాధిస్తున్నారు.
సాక్షి,పాడేరు: మావోయిస్టు పార్టీ కార్యకలపాలు గత మూడేళ్లలో తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తి నిర్మూలనే లక్ష్యంగా పోలీసుశాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈనెల 21 నుంచి 27వరకు ఆవిర్భావ వారోత్సవాలు విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునివ్వడం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసు బలగాలు అణువణువూ జల్లెడ పడుతున్నాయి. ఏవోబీ వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలో నిఘా ఏర్పాటుచేశాయి.
చింతూరు పోలీసు డివిజన్ విలీనంతో..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆవిర్భవించిన తరువాత చింతూరు పోలీసు సబ్‌డివిజన్ జిల్లాలో విలీనమైంది. జిల్లాలోని చింతూరు సరిహద్దులో తెలంగాణ,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చర్ల, శబరి కమిటీలకు చెందిన మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. దీనిలో భాగంగా లంకపల్లి అటవీ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు పార్టీ కీలకనేత మడకం ఉంగాల్ మందుపాతరలు అమరుస్తుండగా పట్టుకొని అరెస్టు చేశారు. ఈ సమయంలో కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వీరికోసం గాలింపు ముమ్మరం చేశారు.
కటాఫ్ ఏరియాలో పోలీసుల పట్టు
మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు ఒడిశాలోని మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల వరకు డ్రోన్ కెమెరాలను ఏర్పాటుచేశారు. మావోయిస్టు పార్టీకి ఒకప్పుడు సురక్షితంగా పేరొందిన కటాఫ్ ఏరియాలో కూడా పోలీసులు నిఘా ఏర్పాటుచేసి పట్టుసాధించారు.
మరోపక్క గంజాయి తోటల గుర్తింపు
పోలీసుశాఖ వినియోగిస్తున్న డ్రోన్ కెమెరాలు గంజాయి తోటలను గుర్తించేందుకు ఉపయోగపడుతున్నాయి. రెండేళ్లుగా అపరేషన్ పరివర్తన్‌లో గంజాయి తోటల ధ్వంసానికి వీటిని వినియోగించింది. ఇప్పుడు ఏజెన్సీలో అటవీ ప్రాంతంలో పూర్తిగా ఏర్పాటుచేయడం వల్ల గంజాయి తోటలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు అవకాశం ఏర్పడింది.
వై.రామవరం: మండలంలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో భద్రత మరింత కట్టు దిట్టం చేశారు. వాహన తనిఖీలు చేపడుతున్నారు. అనుమతులను విచారించి విడిచిపెడుతున్నారు.
ప్రశాంత మన్యమే లక్ష్యం
మావోయిస్టు కార్యకలపాల నిరోధంతో పాటు ప్రశాంత మన్యం లక్ష్యంగా చర్యలు చేపట్టాం. డ్రోన్ కెమెరాల వినియోగంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. గిరిజనులంతా అభివృద్ధినే కోరుకుంటున్నారు. మావోయిస్టు పార్టీలో నేతలు,సభ్యులు జనజీవనస్రవంతిలో కలిసి స్వేచ్ఛగా జీవించాలని పిలుపు నిస్తున్నాం. మావోయిస్టు పార్టీ వారోత్సవాల ప్రభావం ఎక్కడా లేదు. ఏవోబీలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది.
– తుహిన్ సిన్హా, ఎస్పీ, పాడేరు
వ్యూహాత్మకంగా పోలీసుల అడుగులు
మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు అత్యాధునిక పరిజ్ఞానం వినియోగం
డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు
మావోయిస్టు పార్టీ కీలకనేత అరెస్టుతో చెక్
పూర్తిస్థాయిలో పట్టుసాధించిన బలగాలు

