
అడివివెంకన్నగుడెం గ్రామ సభలో మాట్లాడుతున్న ఎస్‌డీసీ లక్ష్మీపతి
ఎస్‌డీసీ వరద సుబ్బారావు
కూనవరం: పోలవరం ముంపు నిర్వాసితులకు నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) వరద సుబ్బారావు అన్నారు. టేకులబోరు గ్రామంలో మంగళవారం ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభ సర్పంచ్ కట్టం రాజమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదలకు తరచూ ముంపునకు గురవుతున్న 17 గ్రామాలను ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా గుర్తించి గ్రామసభలు చేపట్టిందన్నారు. టేకులబోరులో సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే ఆధారంగా పరిహారం, పునరావాసం కల్పించనున్నట్టు తెలిపారు. ఈ విషయంలో నిర్వాసితులు దళారుల (మధ్యవర్తుల) మాటలు విని మోసపోవద్దన్నారు. ఇప్పటికే వలంటీర్లు వద్ద సెస్ సమాచారం ఉందని, గ్రామసభలో చదివి వినిపిస్తారని తెలిపారు. అందులో పొరపాట్లు దొర్లితే దరఖాస్తు ద్వారా తెలియజేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ పాయం రంగమ్మ, జెడ్పీటీసీ గుజ్జా విజయ, తహసీల్దార్ కె.అనసూయ, వైస్ ఎంపీపీ బండారు సాంబశివరావు, కూనవరం ఎంపీటీసీ కొమ్మాని అనంతలక్ష్మి, కార్యదర్శి సురేష్, వీఆర్‌వో పిట్టల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
199 అభ్యంతరాలు
వీఆర్‌పురం: పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామం అడవివెంకన్నగూడెం(ఏవీ గూడెం)లో మంగళవారం నిర్వహించిన ఆర్‌అండ్‌ఆర్ గ్రామ సభలో ఆధార్,బ్యాంక్ తదితరాలపై 199 అభ్యంతరాలు వచ్చినట్టు స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ) లక్ష్మీపతి తెలిపారు. ఎస్‌ఈఎస్ ప్రకారం గ్రామంలో 295 నిర్వాసిత కుటుంబాలను గుర్తించినట్టు చెప్పారు.అనంతరం తహసీల్దార్ ఎన్.శ్రీధర్ అర్హుల జాబితాను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌ఆర్ కమిటీ సభ్యుడు ఉండవల్లి గాంధీబాబు,జెడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి, ఎంపీపీ కారం లక్ష్మి,సర్పంచ్ బుచ్చమ్మ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.