
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటన విజయవంతంపైనే రాష్ట్ర బీజేపీ అన్ని ఆశలూ పెట్టుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రజా సంగ్రామయాత్ర–2’ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహిస్తున్న సభకు అమిత్ షా హాజరుకానున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు ఈ సభ దోహదం చేస్తుందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. ఈ సభకు భారీఎత్తున జన సమీకరణ ఇతర సన్నాహాలపై పూర్తిస్థాయిలో తలమునకలైంది. పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అమిత్‌షా సభను విజయవంతం చేయాలని, తద్వారా అధికార టీఆర్‌ఎస్‌కు ఎన్నికల సవాల్ విసిరాలనే పట్టుదలతో ఉంది.
ముఖ్యంగా జనసమీకరణపై దృష్టి పెట్టిన పార్టీ.. ఇటీవల వరంగల్‌లో జరిగిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సభకు మించి జన సమీకరణ చేయాలని భావిస్తోంది. దూరంగా ఉన్న జిల్లాల్లోని ఒక్కో మండలం నుంచి 1,000 నుంచి 5 వేల మంది, హైదరాబాద్ సమీప జిల్లాల్లోని మండలాల నుంచి 5 నుంచి 10 వేల మంది చొప్పున జన సమీకరణకు నిర్ణయించింది.
ఎక్కడికక్కడ డప్పు చాటింపులు, ర్యాలీలు, మీడియా సమావేశాలతో పాటు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించడం ద్వారా వీలైనంత ఎక్కువ మంది సభకు వచ్చేలా వ్యూహం రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ముఖ్యనేతలు, ఇప్పుడు లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను ఆశిస్తున్న వారికి జన సమీకరణకు సంబంధించి లక్ష్యాలు నిర్దేశించినట్టు సమాచారం.
రాజకీయ వర్గాల్లో ఆసక్తి
రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం తీవ్రమై.. రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో అమిత్ షా పర్యటనపై అటు రాజకీయవర్గాల్లో, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ సభలో అమిత్ షా.. టీఆర్‌ఎస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీలు లక్ష్యంగా చేసే వ్యాఖ్యలు, రాష్ట్ర పార్టీకి చేయబోయే దిశానిర్దేశం, తదితర అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో తామే టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయమనే సందేశాన్ని ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కృత నిశ్చయంతో ఉంది.
అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదీ..
♦అమిత్‌షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14న మధ్యాహ్నం 12.30కు బీఎస్‌ఎఫ్ విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి 2.30 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు.
♦అక్కడి నుంచి 2.35 గంటలకు బయలుదేరి రోడ్డుమార్గంలో 2.55 గంటలకు రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చేరుకుంటారు.
♦మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత అక్కడే హై టీ ఉంటుంది.
♦4.20కి అక్కడి నుంచి బయలుదేరి 5 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు.
♦సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య పార్టీ నేతలతో సమావేశమవుతారు.
♦సాయంత్రం 6.10 నిమిషాలకు హోటల్ నుంచి బయలుదేరి 6.25కు తుక్కుగూడలోని బహిరంగసభ ప్రదేశానికి చేరుకుంటారు
♦6.30 నుంచి 8 గంటల దాకా బహిరంగసభలో పాల్గొంటారు
♦రాత్రి 8.20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరిగి వెళతారు.