రక్తం తక్కువైతంది! | - | Sakshi
Sakshi News home page

రక్తం తక్కువైతంది!

Dec 4 2025 8:34 AM | Updated on Dec 4 2025 8:34 AM

రక్తం తక్కువైతంది!

రక్తం తక్కువైతంది!

● 2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు జిల్లాలో 13,985 మంది గర్భిణులు ఉండగా, ఇందులో 1925 మంది రక్తహీనత బాధితులే కావడం గమనార్హం. వీరిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ● ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు 9,272 మంది గర్భిణులు ఉండగా, 1050 మంది ఎనీమియాతో బాధపడుతున్నట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందారు. ● రిమ్స్‌లోని చిల్డ్రన్స్‌ వార్డులో పదుల సంఖ్యలో చిన్నారులు ఎనీమియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఆయా గ్రామాల్లోని చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిని రిమ్స్‌లోని న్యూట్రీషియన్‌ సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఆదిలాబాద్‌రూరల్‌ మండలం అంకోలి పీహెచ్‌సీ పరిధిలోని టేకిగూడలో ఇటీవల ట్రెయినీ కలెక్టర్‌ సలోని చాబ్రా, అదనపు డీఎంహెచ్‌వో సాధన పర్యటించారు. గ్రామంలో రక్తహీనత సమస్యపై ఆరా తీశారు. ఓ 13 ఏళ్ల బాలికకు 7.8 గ్రాముల రక్తం, మరో ఏడేళ్ల బాలుడికి 6.5 గ్రాములు రక్తం ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలను వారికి వివరించారు.

జిల్లాలో పెరుగుతున్న ఎనీమియా కేసులు సగానికి పైగా మహిళలే బాధితులు గర్భిణులను వెంటాడుతున్న రక్తహీనత పురిటిలోనే తనువుచాలిస్తున్న తల్లీబిడ్డలు పోషకాహార లోపమే అంటున్న వైద్యులు

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాను ఎనీమియా వేధిస్తోంది.. ముఖ్యంగా గిరిజన యువతులు, మహిళలు, చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారు. అనేక రుగ్మతల బారిన పడుతున్నారు.. అనారోగ్యంతో కొంతమంది మృతి చెందుతున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. గర్భిణుల్లో హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉండడంతో వారితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. పోషకాహార లోపంతోనే ఈ సమస్య తలెత్తుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితం కానరావడం లేదు. ప్రసవ సమయంలో రక్తం లేక తల్లడిల్లుతున్నారు. నవ మాసాలు మోసి పురిటి నొప్పుళ్లతోనే కొంత మంది కన్నుమూసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 60 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఎనీమియాతో బాధపడుతున్న చిన్నారులకు జిల్లా కేంద్రంలోని న్యూట్రీషియన్‌ సెంటర్‌లో పోషకాహారం అందిస్తున్నారు.

పెరుగుతున్న కేసులు..

జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న వారి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని గాదిగూడ, సిరికొండ, ఇంద్రవెల్లి మండలాల్లో ఎక్కువ శాతం మంది చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికలు ఎనీమియా బారిన పడుతున్నారు.

తగ్గుతున్న హిమోగ్లోబిన్‌ శాతం..

జిల్లాలోని మహిళల్లో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గుతోంది. వంద మంది మహిళల్లో దాదాపు 60 మందికి 10 గ్రాముల కంటే తక్కువగా హెచ్‌బీ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వెయ్యి మంది గర్భిణుల్లో 6 నుంచి 7 గ్రాముల రక్తం ఉన్నవారు 15 నుంచి 20 మంది వరకు ఉంటున్నారు. పౌష్టికాహార లోపంతోనే ఈ సమస్య ఎదురవుతుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ కారణంగా మాతా, శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు ఆకుకూరలు, పోషకాహారం తీసుకోకపోవడం, తలసేమియా, సికిల్‌సెల్‌, జన్యుపరంగా వివిధ రుగ్మతలతో బాధపడుతున్నారు. గర్భిణులకు ఐరన్‌ పోలిక్‌ మాత్రలు ఇచ్చినప్పటికీ వారు సక్రమంగా వేసుకోకపోవడం, వివిధ రకాల విటమిన్ల లోపంతో హిమోగ్లోబిన్‌ తగ్గుతోంది. ఈ ప్రభావం గర్భిణితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా పడుతోంది. రిమ్స్‌లోని చిల్డ్రన్స్‌ వార్డులో నవజాత శిశువులు మృత్యువాత పడుతున్నారు. తక్కువ బరువుతో పుట్టడం, శ్వాస సంబంధిత వ్యాధులు ఇతర వాటితో జన్మించి మృతి చెందుతున్నారు.

ప్రత్యేక చొరవ చూపుతున్నాం..

ఏజెన్సీ ప్రాంతంలోని మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో ప్రతీ గురువారం ఎనీమియా ముక్త్‌ భారత్‌లో భాగంగా విద్యార్థులకు ఐరన్‌ మాత్రలు అందజేస్తున్నాం. నార్నూర్‌ పీహెచ్‌సీలో బ్లడ్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌ను సైతం ఏర్పాటు చేశాం.

– నరేందర్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement