కేజీబీవీలకు బంకర్‌బెడ్లు
మంచిర్యాలఅర్బన్: కేజీబీవీల్లో మెరుగైన సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం విద్యార్థినులు గదుల్లోని చాపలపై నిద్రించాల్సి వస్తోంది. విద్యార్థినుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం బంకర్ బెడ్లు అందించేందుకు నిర్ణయించింది. ఈ తరహా బెడ్ల వల్ల స్థలం వృథా కాకుండా ఉంటుందని యోచిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని అవసరమో విద్యాలయాల వారీగా లెక్కలు తీసి ఉన్నతాధికారులకు నివేదించారు. హైదరాబా ద్‌కు చెందిన ఓ సంస్థ కాంట్రాక్టు ఆర్డర్లు పొందగా నెలాఖరు వరకు ఆయా కేజీబీవీలకు సరఫరా చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. మొదటి దఫాలో ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలోని 45కేజీబీవీలకు 6860 బంకర్‌బెడ్లు సరఫరా చేయనున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ బెడ్లు ఎన్ని అవసరమో ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా ఆయా కేజీబీవీలకు దశలవారీగా బంకర్ బెడ్లు సరఫరా చేయనున్నారు. మరోవైపు నాబార్డు నిధులతో మౌలిక వసతులు కల్పించనున్నారు. విద్యార్థినుల అవసరాల మేరకు అదనపు తరగతి గదులు, శుద్ధ జల ట్యాంకులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటిసంపులు, బోర్‌వెల్‌లు, ప్రహరీల నిర్మాణం, సోలార్ ఫెన్సింగ్, డా ర్మెటరీ, భోజనశాలలు, దోమలు రాకుండా మెష్‌ల ఏర్పాటు, భవన మరమ్మతులు, విద్యుత్ ఉపకరణాల మరమ్మతులు చేపట్టనున్నారు.
మొదటి దశలో జిల్లాల వారీగా వివరాలు
జిల్లా విద్యాలయాలు పడకలు
ఆదిలాబాద్ 13 2103
ఆసిఫాబాద్ 12 1749
నిర్మల్ 10 1553
మంచిర్యాల 10 1455
45 6860


