
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ రాజర్షి షా ● రెండోవిడత ఆరోగ్యపాఠశాల కార్యక్రమం ప్రారంభం
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని రణదీవెనగర్ ఉన్నత పాఠశాలలో రెండోవిడత ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన బుక్‌లెట్లను ఆవిష్కరించారు. విద్యార్థుల ప్రదర్శనలు తిలకించి వారిని అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 251 పాఠశాలలు, కళాశాలల్లో డిసెంబర్ 31వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ 2047 విజన్–యువత పాత్ర డాక్యుమెంటరీ ప్రకారం రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లలో ఒక బిలియన్ డాలర్ ఎకానమిగా మారే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. లక్ష్యం నెరవేరాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, చిన్నతరహా వ్యాపారాలు, అన్నిరంగాల్లో ఉత్తమ పనితీరు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై ప్రతినెలా సమావేశం నిర్వహించి స్టూడెంట్ ఛాంపియన్లకు సర్టిఫికె ట్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో నిర్మించిన టాయిలెట్స్, శానిటరీ న్యాప్కిన్ మిషన్ ప్రారంభించారు. విద్యార్థులకు సైకిళ్లు అందజేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. డీఈ వో శ్రీనివాస్‌రెడ్డి, సెక్టోరియల్ అధికారి, ఎంఈవో సోమయ్య, రఘురమణ, సుజాత్‌ఖాన్, శ్రీకాంత్‌గౌడ్, ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, ఎస్‌బీఐ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.