
● కాంట్రాక్టర్ల చేతిలోకి గాంధీ పార్కు, స్విమ్మింగ్‌పూల్
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో గల గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని స్వి మ్మింగ్‌పూల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రభుత్వ అజమాయిషీలోనే కొనసాగాయి. కొన్నేళ్లుగా లీజు విధానంలో ఇతరులకు అప్పగించినప్పటికీ పర్యవేక్షణ మాత్రం సర్కారు ఆధ్వర్యంలోనే కొనసాగింది. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. వీటి నిర్వహణ కోసం ఇటీవల టెండర్లు పూర్తిచేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ నెల నుంచి వారే నిర్వహించనున్నారు. టెండర్లలో పోటీపడి లక్షలు వెచ్చించిన కాంట్రాక్టర్లు ఇప్పుడు వాటిని అధిక చార్జీల రూపంలో వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. స్విమ్మింగ్‌పూల్ నిర్వహణను జబాడే రాష్ట్రపాల్ రూ.21లక్షలకు, గాంధీ పార్కు నిర్వహణను టి.ప్రశాంత్ రూ.37.39 లక్షలకు ఏడాది ప్రాతిపాదికన దక్కించుకున్నారు.
గతంలో ఇదీ పరిస్థితి..
స్టేడియం ఆవరణలో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌ను రెండేళ్లుగా లీజు విధానంలో ఓ స్విమ్మింగ్‌కోచ్‌కు అప్పగించారు. ఏడాదికి రూ.9లక్షలకు పైగా చెల్లించేవారు. అలాగే గాంధీ పార్కు నిర్వహణలో భాగంగా రూ.18లక్షల వరకు చెల్లించేవారు. ఈ రెండు కూడా ప్రైవేట్ వ్యక్తులు లీజు తీసుకున్నా అజమాయిషీ మాత్రం ప్రభుత్వపరంగా ఉండేది. ఈ సారి టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగించడంతో ఇక ప్రభుత్వ పాత్ర నామమాత్రంగా మారింది. ప్రధానంగా స్విమ్మింగ్‌పూల్‌కు ఏటా వేసవిలో వేలాది మంది ఉదయం, సాయంత్రం వేళల్లో వస్తుంటారు. చిన్నారులు కోచ్‌ల ద్వారా శిక్షణ తీసుకోవడం ఏటా కనిపిస్తోంది. ఇక గాంధీ పార్కుకు నిత్యం వందలాది మంది ఆహ్లాదం కోసం వస్తుంటారు. ఇక్కడ ఫొటోషూట్‌లు కూడా కొనసాగుతాయి. పిల్లలకు సంబంధించి అనేక ఆట వస్తువులు ఉండటంతో ప్రతి రోజు సాయంత్రం వేళలో పార్కు వందలాది మందితో సందడిగా ఉంటుంది. తాజాగా వీటి నిర్వహణ కాంట్రాక్టర్ల చేతికి పోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాల్సిందే.
భారం కానున్న చార్జీలు..
టెండర్లలో లక్షలు వెచ్చించి కై వసం చేసుకున్న కాంట్రాక్టర్లు ఇక జనం నుంచి ఆ డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్విమ్మింగ్‌పూల్‌లో ప్రతి నెల పెద్దవారికి రూ.700 వరకు చార్జీ ఉండగా ఇప్పుడు రూ.వెయ్యికి పెంచేశారు. చిన్నారులకు ప్రతి నెల రూ.350 నుంచి రూ.400 వరకు ఉండగా ఇప్పుడు రూ.500కు పెంచేశారు. మరో రెండు, మూడు రోజుల్లో గాంధీ పార్కులోనూ చార్జీలను సవరించేందుకు సదరు కాంట్రాక్టర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నిబంధనల మేరకే నిర్వహణ..
గాంధీ పార్కు, స్విమ్మింగ్‌పూల్ నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించాం. టెండర్ నిబంధనలకు అనుగుణంగా వారు నిర్వహణ చేపట్టాలి. స్విమ్మింగ్‌పూల్‌లో స్టేడియం సిబ్బందికి, గాంధీ పార్కులో పనిచేసే కూలీలకు మా నుంచే వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది.
– వెంకటేశ్వర్లు, డీవైఎస్‌వో, ఆదిలాబాద్
టెండర్ల వరకే మా బాధ్యత
గాంధీ పార్కు, స్విమ్మింగ్‌పూల్ నిర్వహణకు సంబంధించి టెండర్లను నిర్వహించే వరకే మున్సిపాలిటీ పా త్ర. ఇక వాటికి సంబంధించిన తదుపరి వ్యవహారాలన్నీ డీవైఎస్‌వో నుంచే జరుగుతాయి. స్విమ్మింగ్‌పూల్ అగ్రిమెంట్ పూర్తి కాగా, గాంధీ పార్కు అగ్రిమెంట్ రెండు, మూడు రోజుల్లో పూర్తి కానుంది. – పేరిరాజు, మున్సిపల్ ఇంజినీర్