కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

May 17 2025 6:02 AM | Updated on May 17 2025 6:02 AM

కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

తిర్యాణి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రీకాంత్‌ కథనం ప్రకారం.. మండలంలోని దేవాయిగూడ పంచాయతీ పరిధిలోని చందగూడ గ్రామానికి చెందిన కుర్సెంగ గోపాల్‌ (27) గత మూడేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవాడు. స్థానికంగా మందులు వాడినా నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో మనస్తాపం చెంది గురువారం మధ్యాహం గ్రామశివారులోని పంట చేనులో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని సోదరి అయిన కమలకు ఫోన్‌ చేసి చెప్పాడు. కుటుంబీకులు ఘటన స్థలానికి చేరుకుని గోపాల్‌ను గోలేటిలోని సింగరేణి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి తండ్రి రాము ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పెళ్లి ఇష్టం లేక యువతి..

ఖానాపూర్‌: పెళ్లిచేసుకోవడం ఇష్టం లేక యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ కథనం ప్రకారం..మండలంలోని పాత ఎల్లాపూర్‌ పంచాయతీ పరిధిలోని ఒడ్డెవాడకు చెందిన అల్లెపు పోశాని, రాజేందర్‌ దంపతుల కూతురు అక్షయ (18) ఇంటర్‌ చదువుతోంది. గతకొన్ని రోజులుగా యువతికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని కోరగా యువతికి ఇష్టం లేదు. ఈక్రమంలో మనస్తాపంతో గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

తిర్యాణి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని మార్కగూడ పంచాయతీ పరిధి వాడిగూడ గ్రామానికి చెందిన మెస్రం యేసు (50)గురువారం గృహ అవసరాల వస్తువుల కొనుగోలు కోసం బైక్‌పై తిర్యాణికి వచ్చాడు. తిరిగి రాత్రి ఇంటికి వెళ్తుండగా కై రిగూడ సమీపంలో రెండు ఎద్దులు పొట్లాడుకుంటూ వచ్చి అటుగా బైక్‌ను ఢీకొట్టాయి. యేసు తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చెలిమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమచికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు సంతోశ్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

గోదావరి నదిలో పడి యువకుడు..

బాసర: బాసర గోదావరి నదిలో ప్రమాదవశాత్తు యువకుడి పడి మృతిచెందినట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. ఆమె కథనం ప్రకారం..బిహార్‌ రాష్ట్రానికి చెందిన శర్మ దిల్‌కుష్‌(19) బాసరలో హమాలీ పనిచేస్తున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి కొన్నిరోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. శుక్రవారం బాసర గోదావరి రెండో ఘాట్‌ వద్ద స్నానాలు ఆచరించేందుకు కుటుంబ సభ్యులు రాగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. ఈత రాకపోవడంతో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలించి యువకుడి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని భైంసా ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రైలు ఢీకొని ఒకరు..

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ రాళ్లపేట రైల్వేస్టేషన్ల మధ్య వంజీరి రైల్వేగేటు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. రైలు పట్టాలు దాటుతుండగా బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్లే రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ సురేష్‌ తెలిపారు. మృతుడికి 50 నుంచి 55 వయస్సు ఉంటుందని, బ్రౌన్‌, వైట్‌ లైనింగ్‌కలర్‌ ఫుల్‌షర్టు, సిమెంట్‌ కలర్‌ నైట్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు.

ట్రాక్టర్‌ కిందపడ్డ మహిళా కూలీ..

ఖానాపూర్‌: మండలంలోని మస్కాపూర్‌ పంచాయతీ పరిధి గంగాయిపేట్‌ గ్రామ శివారులో ఇటుకబట్టి వద్ద ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కిందపడి గాయపడ్డ గిరిజన కూలీ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాయిపేట్‌ గ్రామానికి చెందిన మేస్రం స్వప్న(35) ఇటుక బట్టి వద్ద ట్రాక్టర్‌లో ఇటుకలు నింపేందుకు వెళ్లింది. ఇటుకలు నింపిన తర్వాత ట్రాక్టర్‌ను వెనక్కి తీస్తుండగా ఆమెకు తగిలి కింద పండింది. ఆమె పై నుంచి ట్రాక్టర్‌ టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం నిర్మల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది. స్వప్నకు భర్త, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement