
చిన్నయ్యగుట్టను చూసొద్దాం
లక్సెట్టిపేట: మండలంలోని హన్మంతుపల్లి గ్రామ పంచాయతీ పరిధి చల్లంపేట గ్రామశివారు అటవీప్రాంతంలో సుమారు 150 ఏళ్లక్రితం నుంచి చిన్నయ్యగుట్టపై చిన్నయ్య దేవుడు కొలువై ఉన్నాడు. గిరిజనుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతూ ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచాడు. చారిత్రాత్మకంగా వెలిసిన చిన్నయ్య దేవుడిని గిరిజనులు, భక్తులు తరలివచ్చి పూజిస్తుంటారు. ప్రాచీనకాలంలో పాండవులు ఇక్కడ వ్యవసాయం చేసేవారు. ద్రౌపది స్నానం చేయడానికి కొల్లు గుంటలు, పరుపు బండపై వ్యవసాయం చేసినట్లు నాగళి సాళ్లు, గుడి లోపల దొనలో పట్టే మంచం దేవుని విగ్రహాలు ఉన్నట్లు ఇప్పటికి పూర్వీకులు చెబుతుంటారు. వర్షాకాలం ప్రారంభ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు దర్శనం కోసం వస్తుంటారు. రైతులు వరదపాశం బోనాలు వండి చిన్నయ్య దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. పంట పొలాలకు పురుగులు సోకితే ఇక్కడి తీర్థపు నీరు పొలాలపై చల్లితే పోతాయనే వారి నమ్మకం.
అల్లుబండ..
గుడిలో అల్లుబండకు ప్రత్యేక స్థానం. అక్కడికి వచ్చిన భక్తులు తమ మనసులో కోర్కెలు కోరుకుని అల్లుబండ లేపితే సులభంగా లేచినట్‌లైతే కోరిక నెరవేరుతుంది. అల్లుబండ బరువుగా ఉంటే కోరిక నెరవేరదని నమ్మకం. అల్లుబండ ప్రదేశం వద్ద భక్తులు వారి కోర్కెలు కోరుకుంటారు.
పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి
అటవీప్రాంతంలో ఉన్న చిన్నయ్యగుట్టను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి. రహదారి మధ్యలో మత్తడి నీటిని నిల్వచేయడంతోపాటు వాటికి అనుకూలంగా రోడ్డు ఏర్పాటు చేస్తే పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంది. ఆలయానికి ప్రత్యేక హోదా లభిస్తుంది. గిరిజనుల ప్రత్యేక అలయం ప్రత్యేకంగా ఉంటుంది. భక్తుల సంఖ్య పెరుగుతుంది.
– అన్నం చిన్నన్న, గ్రామస్తుడు, చందారం
పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి
గిరిజనుల ఆరాధ్యుడు చిన్నయ్యదేవుడు
దర్శనం కోసం తరలివస్తున్న భక్తులు
చిన్నయ్య దేవుడి ప్రత్యేకత
పంట పొలాలు దుక్కి దున్నే ముందు దేవుడి దర్శనం చేసుకుంటారు. బండారు(పసుపు) తెచ్చుకుని ధాన్యం వేసేటప్పుడు అందులో కలిపి వ్యవసాయం సాగు చేస్తారు. పంట చేతికి వచ్చిన తర్వాత దినుసును దేవుడికి అప్పజెప్పి మొక్కిన మొక్కు చెల్లించుకుంటారు. వేసవికాలం ముగింపు సమయంలో చిన్నయ్య గుడి భక్తులతో కిటకిటలాడుతుంది.
ఇలా వెళ్లాలి..
పట్టణం నుంచి చందారం, హన్మంతుపల్లి, దౌడపల్లి, రంగపేట, జెండావెంకటాపూర్ గ్రామాల మీదుగా 10 కి.మీ దూరం వాహనాలపై చల్లంపేట వరకు చేరుకోవాలి. అక్కడి నుంచి అటవీ ప్రాంతంగుండా సుమారు 3 కి.మీ కాలినడకన వెళ్తే చిన్నయ్యగుట్ట దేవుడి గుడికి చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చేందుకు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంది. సమీప ప్రాంతంలో నీళ్ల సదుపాయం చిన్నపాటి బుగ్గవాగు లాంటిది ఉంటుంది. అందులోని నీటిని తాగడానికి వాడుతారు. ఇప్పటికి అక్కడ గిరిజనులే పూజార్లుగా కొనసాగుతుంటారు. ప్రతీ ఆది, గురువారాల్లో పూజలు నిర్వహిస్తారు. మేకలు, కోళ్లతో దేవుడికి మొక్కలు చెల్లించి ఆ తర్వాత వంట చేసుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. కాగా, బుగ్గవాగు ప్రాంతంపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఇటీవల రూ.కోటి నిధులు మంజూరు చేసి శిలాఫలకం వేశారు. ఇంకా పనులు ప్రారంభించలేదు.

చిన్నయ్యగుట్టను చూసొద్దాం