breaking news
un meeting
-
పర్యావరణ ఒప్పందానికి ఓకే
♦ రేపు ఐరాస సమావేశంలో సంతకం చేయనున్న జవదేకర్ ♦ పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా న్యూఢిల్లీ: పారిస్‌లో జరిగిన పర్యావరణ సదస్సు ఒప్పందంపై సంతకం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం న్యూయార్క్‌లో జరగనున్న కార్యక్రమంలో భారత్ తరఫున పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఒప్పందంపై సంతకం చేయనున్నారు. గతేడాది నవంబర్‌లో పారిస్‌లో జరిగిన సదస్సులో 190 దేశాలు ముక్త కంఠంతో ఈ ఒప్పందానికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, పశ్చిమబెంగాల్ మాల్దా జిల్లాలోని ఫరక్కా బ్యారేజీకి చెందిన 59 ఎకరాలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు బెటాలియన్ ఏర్పాటుచేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. నకిలీ కరెన్సీ స్మగ్లింగ్‌కు కేంద్రమైన మాల్దాలో బీఎస్ఎఫ్ బెటాలియన్ ఏర్పాటు అవసరమైనందునే కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ భూమిని రక్షణశాఖకు బదిలీ చేస్తున్నట్లు ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ‘పరిహారక అటవీకరణ నిధి బిల్లు-2015’కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండోవిడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు ద్వారా నిరుపయోగంగా ఉన్న అటవీభూమిలో వృక్షాల పెంపునకు రూ.40 వేల కోట్ల నిధిని కేటాయించనున్నారు. దీంతోపాటు బెహరైన్, కువైట్, నేపాల్, దక్షిణ కొరియా, శ్రీలంక, వియత్నాం, బ్రిక్స్ దేశాలతో కుదుర్చుకున్న యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలను కేబినెట్ ప్రశంసించింది. జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, వధ్వానీ ఆపరేటింగ్ ఫౌండేషన్ (డబ్ల్యూఓఎఫ్) మధ్య ఇంతకుముందే కుదిరిన ఒప్పందానికీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ ఒప్పందం ద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికోసం కాలేజీలు, వర్సిటీలు నెలకొల్పనున్నారు. దీంతోపాటుచిలీ ప్రభుత్వంతో వ్యాపార బంధాన్ని మరింత విస్తృతం చేసుకునే ఒప్పందం, భూటాన్‌తో ఇంజనీరింగ్ మౌలిక వసతుల విషయంలో సాంకేతిక సహకారం, సామర్థ్య నిర్మాణం విషయంలో ద్వైపాక్షిక సంబంధాల ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
ఒక 'హాయ్'తో సరిపెట్టేశారు!
వాళ్లిద్దరూ కలుస్తారని, మాట్లాడుకుంటారని, చేతులు కలిపి షేక్హ్యాండ్లు ఇచ్చుకుంటారేమోనని అందరూ ఎదురు చూశారు. కానీ, గత కొంత కాలంగా భారత్ - పాక్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండటం, పాక్ దళాలు పదే పదే భారత భూభాగంపై దాడులు చేస్తుండటంతో ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య ఇవేవీ జరగలేదు. టేబుల్‌కు ఒకవైపు ఆయన, మరోవైపు ఈయన ఉండి.. కేవలం ఒక 'హాయ్'తో సరిపెట్టేశారు. అది కూడా కేవలం చేతులు ఊపుకున్నారంతే. వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటారోనని దౌత్యవేత్తలు, రాజకీయ పండితులు, మీడియా.. అంతా ఎదురుచూశారు. కానీ ఇద్దరి మధ్య నిశ్శబ్దమే రాజ్యమేలింది. కశ్మీర్ సమస్యను కేవలం భారత్, పాక్ రెండు దేశాలు మాత్రమే కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలని భారతదేశం భావిస్తుంటే, పాక్ మాత్రం పదేపదే పలు అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తోంది. దాంతో మోదీ సర్కారు తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఐక్యరాజ్యసమితి సదస్సులో కలిసినప్పుడు కూడా ముందుగా షరీఫే చెయ్యి ఊపారు. దానికి సమాధానంగా మోదీ కూడా చెయ్యి ఊపి సరిపెట్టారు. ఇద్దరూ వాల్డ్రాఫ్ ఆస్టోరియా అనే ఒకే హోటల్లో బస చేసినా, కనీసం కలిసే ప్రయత్నాలు కూడా జరగలేదు. జూలై నెలలో రష్యాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు చేతులు కలుపుకొన్నప్పుడు చాలా మంది చాలా ఆశించారు. కానీ తర్వాత మాత్రం అదేమీ జరగలేదు. ఇరు దేశాల మధ్య జాతీయ భద్రతా సలహాదారు స్థాయిలో జరగాల్సిన సమావేశం కూడా జరగలేదు. కశ్మీర్ వేర్పాటువాదులను పాక్ ప్రోత్సహించడంతో ఈ భేటీ రద్దయింది. ఇక తర్వాతి రోజుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయోనని అంతర్జాతీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.