breaking news
seetampeta
-
మాయ‘దారి’ కష్టాలు
సాక్షి, సీతంపేట: మండలంలోరి పాండ్ర, మేడ ఒబ్బంగి గిరిజన గ్రామాలు ఎత్తైన కొండలపై ఉన్నాయి. ఆ గ్రామాల గిరిజనులు ఓటేయాలంటే నడుచుకుంటూ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్నరాయి పోలింగ్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. లోతుగూడ గిరిజనులు ఓటు వేయాలంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంబాం గ్రామానికి రావాల్సి ఉంటుంది. ఈ గ్రామానికి ఇంకా పూర్తిగా రహదారి నిర్మించలేదు. జోడిమానుగూడ, ఈతమానుగూడ తదితర గ్రామాల పరిధిలో 150 మంది వరకు ఓటర్లు ఉంటారు. వీరంతా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిలిగాం గ్రామానికి ఓటు వేయడానికి రావాల్సి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలు వందకు పైగానే ఉం టాయి. వీరందరికీ ఎటువంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నడకయాతన తప్పదని పలువురు వాపోతున్నారు. సీతంపేట ఏజెన్సీలో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతాలే ఎక్కువ. ఇక్కడే ఎక్కువగా గిరిజనులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే సాధారణ ఎన్నికల్లో మాత్రం కొండలపై నివసిస్తున్న గిరిజనులకు ప్రతి ఐదేళ్లకోమారు జరిగే ఎన్నికల్లో అవస్థలు తప్పడం లేదు. సీతంపేట ఏజెన్సీలో 456 గిరిజన గ్రామాలున్నాయి. వాటిలో 200 గ్రామాల వరకు కొండలపైనే ఉన్నాయి. 420 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించారు. మిగతా గ్రామాలకు అరకొరగా రహదారి సౌకర్యం ఉంది. అయితే రహదారి కల్పించిన గ్రామాలకు ఎటువంటి రవాణా సదుపాయాలు లేవు. మండలంలోని 24 పంచాయతీల్లో 103 పోలింగ్ కేంద్రాలుండగా ఓటర్లు 39,337 మంది ఉన్నారు. వారిలో పురుషులు 18,531 ఉండగా మహిళలు 19.967 మంది ఉన్నారు. ఇతరులు ఒకరు ఉన్నారు. మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. 10 వేల మందికి పైగా ఓటర్లు కొండలపై నివాసముంటున్నారు. వీరంతా పోలింగ్ కేంద్రాలకు నడిచే రావాల్సి ఉంటుంది. ఓటుహక్కువినియోగించుకోవాలి ఓటు హక్కు ఉన్న ప్రతి ఓక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి. 103 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కేంద్రాలన్నింటిలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాలు లేని కొన్ని గ్రామాల ఓటర్లు సమీప పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి. - ప్రకాశరావు, తహసీల్దార్ నడుచుకుంటూ వెళ్తాం బెన్నరాయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తాం. దీంతో చాలా మందికి అవస్థలు తప్పడం లేదు. గత ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి. ఏదో విధంగా కేంద్రాలకు చేరుకుని ఓటు వేయడానికి అందరం మొగ్గుచూపుతాం. - ఎం.ఫల్గుణరావు, పాండ్ర కొండ దిగి ఎక్కాలి ఓటేయాలంటే కొండదిగి ఎక్కాల్సి ఉంటుంది. చాలా కష్టమైన పని. మా గ్రామం ఈతమానుగూడ పరిధిలో చిన్న, చిన్న గూడలు ఉన్నాయి. ఈ గూడల గిరిజనులంతా కొండదిగువన ఉన్న శిలిగాం గ్రామానికి రావాల్సి ఉంటుంది. ఇబ్బందులు తప్పడం లేదు. - ఎస్.చెంచయ్య, గొయిది మాజీ సర్పంచ్ -
వేతనానికి కొండెక్కాల్సిందే!
ఉపాధి వేతనదారులకు తప్పని వెతలు పది కిలోమీటర్లు కొండెక్కాలి రెండేళ్లుగా ఉపాధి లేని బిల్లగూడ కాలనీ వాసులు సీతంపేట : ఉపాధి హామీ సిబ్బంది చేసిన తప్పిదానికి రెండేళ్లుగా ఆ గిరిజనులకు ఉపాధి పనుల్లేకుండా పోయాయి. మా జాబ్‌కార్డులు ఒక చోట పనులు మరోచోట కల్పిస్తున్నారు, జాబ్‌కార్డులు మార్చాలంటూ పదేపదే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదని మండలంలోని కుశిమి పంచాయితీ బిల్లగూడ కాలనీకి చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వీరంతా మండల పరిషత్ కార్యాలయ అధికారులను ఆశ్రయించారు. వివరాలు పరిశీలిస్తే... మండలంలోని కుశిమి పంచాయతీ పరిధిలో బిల్లగూడ కాలనీలో 30 వరకు గిరిజన కుటుంబాలు నివశిస్తున్నాయి. మూడు శ్రమశక్తి గ్రూపులు ఉండగా 21 జాబ్‌కార్డులుండగా 60 మంది ఉపాధి హామీ పనిలో పాల్గొంటున్నారు. వీరందరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శంబాం పంచాయతీ బిల్లగూడలో జాబ్‌కార్డులు ఉండడంతో అక్కడ వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వేతనాల కోసం వెళ్లాలంటే కొండలు దాటి పది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని గ్రామానికి చెందినవేతనదారులు బాబురావు, శ్యామలరావు, సిమ్మయ్య తదితరులు తెలిపారు. 2007 నుంచి ఇదే సమస్య ఉందని తెలిపారు. ఈ సమస్యతో రెండేళ్లుగా ఉపాధి పనులకు కూడా వెళ్లడం లేదన్నారు. ఉపాధి అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం లేదని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలని గిరిజనులు కోరుతున్నారు.