సంగం రైతుకు పంగనామం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన సహకార రంగంలోని సంగం డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్చి ఆ రైతుకే పంగనామం పెట్టారు. వెయ్యి కోట్ల రూపాయల డెయిరీ ఆస్తులను స్వాహా చేయడానికి ప్రస్తుత చైర్మన్, పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్రకుమార్ పన్నాగం రచించారు. 1995 మ్యాక్స్ చట్టంలో కొనసాగుతున్న డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్చి తానే శాశ్వత చైర్మన్‌గా ఉండాలనే నరేంద్ర నిర్ణయాన్ని జిల్లాలోని పాల ఉత్పత్తిదారులు, రైతులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ స్వప్రయోజనాల కోసం నరేంద్ర ముందుకు సాగుతుండటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
కంపెనీ చట్టంలో చైర్మకే అధికారాలు..
చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం(సంగం డెయిరీ) మొదట్లో 1964 సహకార చట్టంలో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగింది. తరువాత ఎన్టీఆర్ కాలంలో 1995లో మ్యాక్స్ చట్టంలోకి వచ్చిన తరువాత కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. దీని ద్వారా పరస్పర సహాయ సహకార(మ్యాక్స్)చట్టం ద్వారా కొనసాగుతోంది. దీని ద్వారా గుత్తాధిపత్యం పాలకవర్గం అజమాయిషీలో ఉండేది. ప్రస్తుత డెయిరీకి చైర్మన్‌గా ఉన్న నరేంద్ర కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. దీని ద్వారా పూర్తి అధికారాలు చైర్మన్‌కు మాత్రమే ఉంటాయి. గతంలో ఉన్న గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం కాస్తా ప్రస్తుతం సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌గా మారింది.
రైతుకు ప్రయోజనం శూన్యం..
జిల్లాలోని పాల ఉత్పత్తిదారుల పెట్టుబడిని సొంత పెట్టుబడిగా మార్చుకొని చైర్మన్ నరేంద్ర ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో సంగం డెయిరీ మనుగడ ప్రశ్నార్ధకంగా తయారైంది. ప్రభుత్వ జోక్యం లేకుండా డెయిరీకి ఎన్నికలు జరగకుండా చైర్మన్ ద్వారా ఎంపిక చేసే పక్రియకు అవకాశం కల్పించారు. వ్యాపార లావాదేవీలు, క్రయవిక్రయాలు ఎవరి జోక్యం లేకుండా చైర్మన్ ద్వారా సాగనున్నాయి. జిల్లాలో సుమారు 600 పాల సొసైటీలు ఉన్నాయి.
మ్యాక్స్ చట్టం నుంచి కంపెనీ యాక్ట్‌లోకి సంగం డెయిరీ వెళ్లటం ద్వారా రైతులకు ఎటువంటి ప్రయోజనాలు కలగకపోయినా.. చైర్మన్‌కు మాత్రం సుమారు వెయ్యి కోట్ల విలువ కలిగిన స్థిర, చర ఆస్తులు దక్కనున్నట్లు సమాచారం. డెయిరీ పరిధిలో జిల్లాలోని మిల్క్సొసైటీలకు ఈ ఏడాది బోనస్‌గా లీటర్‌కు రూ.1.5 ప్రకటించిన పాలకవర్గం వారి వద్ద నుంచి ఎన్నికల ఫండ్ కోసం తిరిగి అర్ధ రూపాయి చొప్పున సుమారు రూ.5కోట్ల మేర వసూలు చేసినట్లు తెలిసింది. డెయిరీలోని ఉద్యోగులను పార్టీ కార్యక్రమాలకు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తెల్ల ఏనుగు వల్ల అన్నీ నష్టాలే...
సంగం డెయిరీలోని టెట్రా ప్యాకింగ్‌ను సిబ్బంది తెల్ల ఏనుగుగా పిలుస్తారు. దీని వల్ల డెయిరీకి ఎటువంటి ఉపయోగం లేకపోయినా ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది. టెట్రా ప్యాకింగ్ కోసం గతంలో మాజీ చైర్మన్లు వీరయ్య చౌదరి, రాజన్‌బాబు పాలన కాలంలో ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రస్తుత చైర్మన్ నరేంద్రకుమార్ దీని కోసం విదేశాల నుంచి సుమారు రూ.8 కోట్ల వ్యయంతో టెట్రా ప్యాకింగ్ యంత్రాలను దిగుమతి చేసుకొన్నారు.
దీనిని రైతుల ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు డెయిరీ హెరిటేజ్‌కు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. హెరిటేజ్‌లో కూడా లేని టెట్రా ప్యాకింగ్ కేవలం సంగం డెయిరీలో హెరిటేజ్ పేరుతో ప్యాకింగ్ చేసి వారికి ఉపయోగపడుతున్నారు. దీని వలన కోట్లాది రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన టెట్రా ఫ్యాకింగ్ ఆశయం దెబ్బతింటుంది.