breaking news
P.Mahender Reddy
-
తెలంగాణను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
తాండూరు: తెలంగాణాను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తాండూరులోని గంగోత్రి హైస్కూల్ సిల్వర్‌జూబ్లీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రూ.50కోట్లతో జిల్లాల్లో పాఠశాలల భవనాలు, తరగతి గదుల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుస్తూనే ప్రైవేట్ పాఠశాలలకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. మంచి లక్ష్యంతో పాతికేళ్లుగా పాఠశాలను నడిపిస్తున్న గంగోత్రి స్కూల్ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు. ‘దశవతారం’పై విద్యార్థి ఇందూరు ప్రణయ్‌కుమార్ బృందం చేసిన నృత్యప్రదర్శన అతిథులను ఆకట్టుకుంది. ప్రణయ్‌కుమార్‌ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ నర్సింహులు, పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత, కరస్పాండెంట్ డా.సుధాకర్ పాల్గొన్నారు. -
దేశంలోనే ఆదర్శంగా ‘తెలంగాణ’
చేవెళ్ల: దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చేవెళ్లలోని డివిజన్ పశుసంవర్ధకశాఖ కార్యాలయ ఆవరణలో రూ.65 లక్షల వ్యయంతో రైతు శిక్షణ- విస్తరణ కేంద్రం భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కొద్ది ఏళ్లలోనే బంగారు తెలంగాణ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ప్రణాళికలు తయారుచేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని చేవెళ్ల, పరిగి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, వికారాబాద్‌లలో రైతు శిక్షణ కేంద్రాల నిర్మాణానికి రూ.3.25 కోట్లు, 19 పశువైద్యశాలల నిర్మాణాలకు రూ.4.87 కోట్లు మంజూరు చేశామన్నారు. ముఖ్యంగా సాగునీటి అవసరాల కోసం 3.718 చెరువులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వీటిని దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలోని కందుకూరు, మహేశ్వరం ప్రాంతాల్లో ఇప్పటికే 4నుంచి 5వేల ఎకరాల భూమిని గుర్తించామని, వీటిలో సుమారు రూ.30వేల కోట్లతో ఎడ్యుకేషనల్ హబ్, ఫార్మాసిటీ తదితర పారిశ్రామికవాడలను ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని చెప్పారు. జిల్లాలో రూ.50 కోట్లతో 140 ప్రభుత్వ పాఠశాలలకు భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రోజుకు 93లక్షల మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుండగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సంఖ్య 35 నుంచి 40 లక్షలు ఉంటుందన్నారు. ఆర్టీసీలోనే ప్రయాణం సురక్షితమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 94 డిపోలున్నాయన్నారు. చేవెళ్లలో డిపో నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలోని రహదారుల అభివృద్ధి కోసం ఆర్‌అండ్‌బీకి రూ.10వేల కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు రూ.5వేల కోట్లు విడుదల చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, పశుసంవర్ధకశాఖ ఆర్జేడీ వరప్రసాద్‌రెడ్డి, చేవెళ్ల డివిజన్ వెటర్నరీ వైద్యాధికారి మధుసూదన్, పీఆర్ ప్రాజెక్టు వర్క్స్ డీఈఈ జగన్మోహన్రెడ్డి, చేవెళ్ల ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, సర్పంచ్ ఎం.నాగమ్మ, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, సర్పంచ్ రాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు విఠలయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, నాయకులు రాంరెడ్డి, ఎం.యాదగిరి, బి.ఆగిరెడ్డి, రమేష్‌రెడ్డి, రాములు, మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎంవో అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే చిందులు
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులపై రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే పి. మహేంద్రరెడ్డి బుధవారం చిందులు తొక్కారు. తనకు, తన వాళ్లకు సంబంధించిన పనులు ఎందుకు చేయడం లేదంటూ సదరు ఎమ్మెల్యే సీఎం కార్యాలయ అధికారులపై ఒంటి కాలితో లేచారు. తన వాళ్లకు సంబంధించిన మెడికల్ కాలేజీ పర్మిషన్ ఫైల్‌ను కావాలనే తొక్కిపట్టారంటూ ఆరోపించారు. ఆ క్రమంలో సీఎంవో అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే మహేంద్రరెడ్డి వాడిన పదజాలం పట్ల సీఎంవో అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.